మెగాస్టార్ కు తప్పని ఎదురు చూపులు..!

Update: 2021-08-16 09:40 GMT
'ఖైదీ నెం. 150' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్న చిరు కు.. కరోనా మహమ్మారి వచ్చి బ్రేక్స్ వేసింది. దీంతో ఒక్క సినిమా కంప్లీట్ చేయడానికే చాలా టైమ్ తీసుకోవాల్సి వచ్చింది. ''ఆచార్య'' టాకీ పార్ట్ పూర్తి చేసిన చిరంజీవి.. ఇటీవలే 'లూసిఫర్' తెలుగు రీమేక్ ని సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఇదే క్రమంలో 'ఆచార్య' లో పెండింగ్ ఉన్న రెండు సాంగ్స్ ని కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నారు.

అయితే 'ఆచార్య' సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనేది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత మే 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఆలోపు సెకండ్ వేవ్ ప్రభావం రావడంతో విడుదల వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు థియేటర్లు తిరిగి ఓపెన్ అవడంతో పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ని లాక్ చేసుకుంటున్నాయి. వచ్చే సంక్రాంతి పండుగ వరకు అప్పుడే కర్చీఫ్స్ వేస్తున్నారు. అయితే 'ఆచార్య' ఆగమనం ఎప్పుడో చెప్పలేకపోతున్నారు.

నిజానికి 'ఆచార్య' చిత్రాన్ని పరిస్థితులు అనుకూలిస్తే దసరా బరిలో నిలపాలని మేకర్స్ భావించారు. అయితే 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని పక్కా అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించడంతో మరో తేదీ కోసం ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న తేదీన రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆల్రెడీ నాలుగు పెద్ద సినిమాలు ఆ సీజన్ ని బ్లాక్ చేసుకున్నాయి.

ఇప్పుడు కొత్తగా 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ RRR పోస్ట్ పోన్ అయితే ఆ తేదీకి 'ఆచార్య' చిత్రాన్ని తీసుకురావాలని చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఆల్టర్నేటివ్ గా జనవరి 7వ తేదీని కూడా పరిశీలిస్తున్నారని అంటున్నారు. దీనిపై ఈ వీకెండ్ లో ఓ క్లారిటీ రానుంది. ఎందుకంటే ఆగస్టు 22 మెగాస్టార్ బర్త్ డే కంటే ముందు 'ఆచార్య' విడుదల తేదీని అనౌన్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. దీని కోసం కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులను కూడా మేకర్స్ పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ఒకవేళ కరోనా మళ్ళీ విజృంభిస్తే పరిస్థితులు చేయి దాటి పోవడంతో పాటుగా.. సినిమాల విడుదల తేదీలన్నీ తారుమారు అవుతాయి. అందుకే 'ఆచార్య' విడుదల తేదీ ప్రకటన లేట్ అవుతోంది అనేవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో చివరకు ఏ డేట్ ని చిరంజీవి 152వ సినిమాకి ఖరారు చేస్తారో మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, 'ఆచార్య' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. నిరంజన్ రెడ్డి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Tags:    

Similar News