గన్‌ ఫైర్‌ చేశాడని సినీ విమర్శకుడి అరెస్ట్‌

కేవలం క్రిటిక్‌గా మాత్రమే కాకుండా నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో చేసిన ఈయన ఒకటి రెండు సినిమాలకు రచయితగానూ వ్యవహరించినట్లు చెప్పుకుంటూ ఉంటాడు.;

Update: 2026-01-24 08:06 GMT

బాలీవుడ్‌ ప్రేక్షకులకు కేఆర్‌కే అలియాస్ కమల్‌ రషీద్ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్‌ మీడియా ఫాలో అయ్యే సౌత్ ఇండియన్ ప్రేక్షకులు సైతం అప్పుడప్పుడు ఈయన గురించి చూస్తూ ఉంటారు. స్టార్‌ హీరోల సినిమాలు వచ్చిన సమయంలో తనకు తానుగా పెద్ద క్రిటిక్‌ను అని చెప్పుకుంటూ ఇష్టానుసారంగా రివ్యూలు ఇస్తూ ఉంటాడు. సినిమాలు విడుదల అయిన తర్వాత, విడుదల కాక ముందు కూడా కొన్ని సినిమాల గురించి పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేశాడు అంటూ ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్‌ హీరోలకు ఈయన పూర్తిగా నెగటివ్‌ రివ్యూలు ఇవ్వడం మాత్రమే కాకుండా సోషల్‌ మీడియాలో ఆ హీరో గురించి మాత్రమే కాకుండా మరికొంత మంది హీరోలు, హీరోయిన్స్ కూడా తప్పుడు ట్వీట్స్ చేయడం, కొన్ని పుకార్లను పట్టించడం వంటివి చేయడం ద్వారా చాలా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు.

కమల్‌ ఆర్‌ ఖాన్‌ పై పోలీసు కేసు నమోదు..

కేవలం క్రిటిక్‌గా మాత్రమే కాకుండా నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో చేసిన ఈయన ఒకటి రెండు సినిమాలకు రచయితగానూ వ్యవహరించినట్లు చెప్పుకుంటూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో ఈయన సోషల్‌ మీడియా హడావిడి కాస్త తగ్గిందని చెప్పాలి. గతంతో పోల్చితే అంత అగ్రసివ్‌గా ట్వీట్స్ చేయడం, సినిమాలపై విమర్శలు చేయడం లేదని ఆయన్ను ఫాలో అవుతున్న వారు అంటూ ఉంటారు. ఇప్పుడు ఈయన వార్తల్లో నిలవడం చర్చనీయాంశం అయింది. అది కూడా ఒక గన్ ఫైరింగ్‌ విషయంలో కమల్‌ ఆర్‌ ఖాన్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కమల్‌ ఆర్‌ ఖాన్ తన గన్‌ నుంచి కాల్పులు జరిపినట్లుగా ఒప్పుకోవడం కూడా ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇతడు తన గన్‌ ను పరీక్షించడం కోసం కాల్పులు జరిపినట్లుగా చెబుతున్నప్పటికీ పోలీసులు అనుమానంతో అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతున్నారు.

బాలీవుడ్‌ దర్శకుడి ఇంటి మీద గన్ ఫైర్‌..

బాలీవుడ్‌ దర్శకుడు నీరజ్ కుమార్ మిశ్రా నివాసం ఉండే ఇంటి మీద బుల్లెట్లు ఉండటంతో పాటు, కొన్ని రోజుల ముందు గన్‌ సౌండ్‌ వచ్చిందని స్థానికులు చెప్పడంతో పోలీసులు విచారణ జరుపగా కమల్‌ ఆర్‌ ఖాన్‌ గన్‌ నుంచి ఆ బుల్లెట్లు వచ్చినట్లుగా గుర్తించారు. దాంతో వెంటనే పోలీసులు ఆయన్ను పట్టుకుని విచారించగా, తాను గన్‌ క్లీన్‌ చేసుకుని అడవి వైపు కాల్పులు జరిపిన మాట వాస్తవం అని, అది కేవలం టెస్టింగ్‌ కోసం మాత్రమే అని అన్నాడు. తాను కాల్పిన బుల్లెట్లు ఆ ఇంటి మీద పడి ఉంటాయని, తాను కావాలని కాల్చింది ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇతడిని లోతుగా విచారిస్తున్న పోలీసులు ఏం విషయాలు తెలుసుకుంటారా అనే విషయమై బాలీవుడ్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ విషయమై బాలీవుడ్‌ లో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పోలీసుల విచారణ తర్వాత అసలు విషయం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కాల్పుల విషయమై కమల్‌ ఆర్‌ ఖాన్‌ ను విచారిస్తున్నారు..

కమల్‌ ఆర్‌ ఖాన్‌ కి వ్యక్తిగత భద్రత కోసం గన్‌ లైసెన్స్‌ ను కోర్ట్‌ మంజూరు చేసింది. గన్‌ ఆయన వద్ద చాలా కాలం నుంచి ఉంటూ వస్తుంది. లైసెన్స్ రెన్యువల్‌ చేసుకుంటూ కమల్‌ ఆర్‌ ఖాన్‌ వస్తున్నాడు. అయితే తాజాగా ఆయన గన్‌ నుంచి ఫైరింగ్‌ జరగడంతో ఆయన కావాలని ఎవరిని అయినా చంపేందుకు ప్రయత్నించాడా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్థానికంగా ఉన్న కొన్ని సీసీ టీవీ ఫుటేజ్‌లను సైతం పోలీసులు చూస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం గన్‌ ను టెస్ట్‌ చేయడం కోసం కాల్చినట్లు చెబుతున్న ఆయన మాటలను నమ్మలేకపోతున్నాం అన్నట్లుగా పోలీసు వర్గాల వారు మాట్లాడుకుంటున్నారట. అందుకే విచారణ లోతుగా జరగాలని ఉన్నతాధికారులు సైతం భావించారని, అందుకే అదుపులోకి తీసుకుని మరీ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News