చిరు.. క్యా డైలాగ్ హై!

Update: 2017-01-11 12:44 GMT
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా.. రాజకీయాల్లోకి రావడం వల్ల మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ట దెబ్బ తిందన్నది వాస్తవం. ఆయనకున్న క్లీన్ ఇమేజ్ రాజకీయాల వల్ల మసకబారింది. ఒకప్పుడు ఆయన సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీస్తే.. పోరాట యోధుడిగా కనిపిస్తే జనం బాగా కనెక్టయ్యేవాళ్లు. ఆయన్ని నిజంగానే ఆ హీరో పాత్రలో చూసుకునేవాళ్లు. ‘ఠాగూర్’ లాంటి సినిమాల్లో ఆయన పోషించిన పాత్రల గురించి ఈ సందర్భంలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది.

ఐతే రాజకీయాల్లో మునిగి తేలి.. ఇప్పుడు సినిమా రంగంలోకి పునరాగమనం చేసిన చిరు తన రీఎంట్రీ మూవీ కోసం సామాజికాంశాలున్న కథనే ఎంచుకోవడం విశేషమే. ఐతే రాజకీయ రంగంలో చిరు ఇమేజ్ దెబ్బ తిన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన సినిమాలో ప్రజా సమస్యల మీద మాట్లాడితే.. తనను తాను గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న సందేహాలు కలిగాయి. ఈ విషయంలో చిరు ఏ విధంగా బ్యాలెన్స్ పాటిస్తాడో అని అంతా ఎదురు చూశారు.

ఐతే ఈ విషయంలో చిరు కొంచెం సమతూకంతోనే వ్యవహరించాడు. ఓ సీన్లో చిరు నోటి నుంచి.. ‘‘గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని రకాల రాజకీయాలు చూసినవాడిని. దెబ్బలు తట్టుకున్నవాడిని’’ అంటాడు. ఈ డైలాగ్ ఉద్దేశమేంటో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. తాను రాజకీయాల్లో దెబ్బలు తిన్నానని చిరు పరోక్షంగా ఒప్పుకోవడం విశేషమే. అలాగే ‘‘నవ్విన వాళ్లు ఏడ్చే రోజు వస్తుంది’’.. ‘‘అభిమానాన్ని కూడా అమ్ముకునే స్థాయికి దిగజారలేదు’’ లాంటి డైలాగులు కూడా చిరు పలికాడు. ఇలాంటి డైలాగుల్ని కథలో జొప్పించేలా చేసినందుకు దర్శకుడు.. రచయితల్ని అభినందించాల్సిందే. కొన్ని చోట్ల తన గురించి తాను గొప్పగా చెప్పుకునే ప్రయత్నాలు కూడా జరిగినప్పటికీ.. పైన చెప్పుకున్న డైలాగులు మాత్రం సమయోచితంగా అనిపించాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News