'RRR' ప్ర‌మోష‌న్స్ కి అంత‌ బ‌డ్జెట్ కేటాయించారా?

Update: 2021-12-30 14:30 GMT
ఒక సినిమా నిర్మాణం కోసం బ‌డ్జెట్ ని కేటాయించే విష‌యంలో నిర్మాత‌లు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారో..ఆ మూవీ ప్ర‌మోషన్స్ కోసం కూడా ప్ర‌త్యేకంగా బ‌డ్జెట్ ని కేటాయిస్తూ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే అది చిన్న సినిమాలకు ఓ రేంజ్‌లో పాన్ ఇండియా సినిమాకు ఓ రేంజ్ లో వుంటోంది. చిన్న సినిమా ప్ర‌చారం కోసం ఓ మోస్త‌రు బ‌డ్జెట్ ని కేటాయిస్తుంటే 50 కోట్ల‌కు మించి బ‌డ్జెట్ చిత్రాల‌కు, పాన్ ఇండియా మూవీస్ కి ప్ర‌మోష‌న్స్ కోసం నిర్మాత‌లు కాస్త భారీ స్థాయి బ‌డ్జెట్ నే కేటాయించ‌డం ఇప్ప‌డు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ ఇద్ద‌రూ క‌లిసి తొలిసారి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ పాన్ ఇండియా మూవీ `RRR`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించారు. బాలీవుడ్ భామ అలియాభ‌ట్, హాలీవుడ్ లేడీ ఒలివియా మోరీస్ హీరోయిన్ లుగా న‌టించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న సంక్రాంతి కానుక‌గా దాదాపు 14 భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా ఈ మూవీ  ప్ర‌మోష‌న్స్ ని ప్లాన్ చేశారు.

వ‌రుస ఈవెంట్ లు నిర్వ‌హిస్తూ ప్ర‌చారాన్నిహోరెత్తిస్తున్నారు. అంతే కాకుండా `RRR` ప్ర‌చారానికి ఏ ప్లాట్ ఫామ్ ని వ‌ద‌ల‌కుండా వాడేస్తున్నారు రాజ‌మౌళి. ఉత్త‌రాదిపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేసిన రాజ‌మౌళి ముంబైలో వారం పాటు అక్క‌డే మ‌కాం వేసి బాలీవుడ్ లో `RRR` ప్ర‌చారానికి ఎన్ని ప్లాట్ ఫామ్ లు వున్నాయో వాట‌న్నింటిని విజ‌య‌వంతంగా ఉప‌యోగించుకున్నారు. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌ కి భారీ బ‌డ్జెట్ నే మేక‌ర్స్ కేటాయించిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

`RRR` ప్ర‌మోష‌న్స్ కోసం నిర్మాత డీవీవీ దాన‌య్య ఏకంగా 20 కోట్లు కేటాయించార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఇది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రేంజ్ బ‌డ్జెట్ ని కేటాయించారు కాబ‌ట్టే రాజ‌మౌళి ప్ర‌చార బాధ్య‌త‌ల్ని తీసుకుని మ‌రీ ఈవెంట్ ల‌ని ప్ర‌త్యేకంగా ప్లాన్ చేస్తూ వ‌స్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టికే కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ ల‌ని నిర్వ‌హించిన `RRR` టీమ్ త్వ‌ర‌లోనే తెలుగులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయ‌బోతోంది. దీనికి సంబంధించిన డేట్‌, ప్లేస్ ని త్వ‌ర‌లోనే అనౌన్స్ చేయబోతున్నార‌ట‌.

జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానున్న ఈ మూవీ కోసం ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ని మ‌రో వారం రోజుల పాటు కంటిన్యూగా నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేశారు రాజ‌మౌళి. ఇందుకు సంబంధించిన ప్లాన్ ని జ‌క్క‌న్న ఇప్ప‌టికే సిద్ధం చేశార‌ట‌. ప్రీ ఇండిపెండెంట్ టైమ్ లో బ్రిటీష్ వారికి వ్య‌తిరేకంగా పోరాడిన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ రాజుని, అదే స‌మ‌యంలో నైజాంకు గెరిల్లా పోరాటంతో స‌వాల్ విసిరిన గోండు బెబ్బులి కొమురం భీం ని క‌లుపుతూ ఆ ఇద్ద‌రూ క‌లిసి బ్రిటీష్ వారిపై స‌మ‌ర శంఖం పూరిస్తే ఏం జ‌రిగింద‌న్న ఫిక్ష‌న‌ల్ క‌థ‌తో ఈ సినిమాని రూపొందించారు.

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్ న‌టుల క‌ల‌యిక‌గా రూపొందిన ఈ చిత్రం ఇప్ప‌టికే అంద‌రిలో అంచ‌నాల్ని పెంచేసింది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ ట్రైల‌ర్ వ‌ర‌ల్డ్ వైడ్ గా సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ని స్కై హైకి చేర్చేసింది. అంతే కాకుండా ట్రైల‌ర్ లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ సింగాలై గ‌ర్జించిన తీరు సినిమా ఏ రేంజ్ లో సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతోంద‌న్న‌ది స్ప‌ష్టం చేసింది.
Tags:    

Similar News