బోయపాటి వాళ్లిద్దరినీ ఎలా ఒప్పించాడంటే..

Update: 2016-07-11 06:07 GMT
బోయపాటి కెరీర్‌ ను మలుపు తిప్పిన సినిమాలు రెండు. ఒకటి అతడి తొలి సినిమా భద్ర.. ఇంకోటి అతడికి టాలీవుడ్లో రెండోసారి లైఫ్ ఇచ్చిన సింహా. ఈ రెండు సినిమాల విషయంలో ఆ ఇద్దరు హీరోలూ కాస్త వెనకా ముందు ఆలోచించారని.. తాను వాళ్ల ఇమేజ్‌ ను మార్చే ప్రయత్నంలో ఎక్కడ ఎదురు దెబ్బ తగులుతుందో అని కంగారు పడ్డారని చెప్పాడు బోయపాటి. మరి తాను వాళ్లను ఏ విధంగా కన్విన్స్ చేశానో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు బోయపాటి. అతనేమన్నాడంటే..

‘‘రవితేజకు ‘భద్ర’ కథ చెప్పినపుడు తనను మరీ కొత్తగా చూపించడానికి ప్రయత్నించొద్దని.. తర్వాత ఇబ్బంది పడతావని హెచ్చరించాడతను. ముందు ఐదు రోజుల షెడ్యూల్ చేస్తానని.. నచ్చితేనే చేయమని చెప్పాను. రవితేజ సరే అన్నాడు. ఆ సినిమాలోని ఐదు కీలకమైన  సన్నివేశాలను షూట్‌ చేసి చూపించాను. అవి చూడగానే.. ‘ఇక నేను మానిటర్‌ చూడను. సినిమా తీసేయ్‌’ అన్నాడు రవితేజ.

ఇక బాలయ్య విషయానికి వస్తే.. ‘సింహా’ చేయడానికి ముందు బాలయ్య నటించిన వాటిలో ఓ నలభై సినిమాలు తీసి.. పదే పదే చూశాను. ఆ తర్వాత ఆయన కోసం కథ రాసి వినిపించాను. ఐతే తన అభిమానులు ఒక బాడీ లాంగ్వేజ్ కు అలవాటు పడిపోయారని.. తనను ఇలా సెటిల్డ్ గా చూడరేమో అని సందేహం వ్యక్తం చేశారు. దానికి నేను.. ‘బాబు గారూ.. మీరు చెప్పని డైలాగ్‌ ఉందా.. కొట్టని పంచ్‌ ఉందా.. చేయని క్యారెక్టర్ వేరియేషన్ ఉందా.. మీరు అన్ని రకాల పాత్రలు చేసినా మీకు ఈ మధ్య ఆశించిన హిట్టు రాలేదు. అందుకే మీరు నాకో అవకాశం ఇవ్వాలి’ అన్నాను. ఒక్క మాట్లాడకుండా సినిమా ఓకే చేశారు. ఆయన నన్ను నమ్మారు. ‘సింహా’తో ఆ నమ్మకాన్ని నిలబెట్టాను’’ అని బోయపాటి చెప్పాడు.
Tags:    

Similar News