బోయపాటి.. క్లైమాక్స్.. ఓ సెంటిమెంట్

Update: 2016-07-15 04:48 GMT
బోయపాటి శ్రీను సినిమాలంటే అదో రకం. హద్లుల్లేని హీరోయిజం.. తెరంతా రక్తపాతం.. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్.. భారీ క్లైమాక్స్.. ఇలా అన్నీ లెక్కలేసుకుని చేస్తుంటాడు బోయపాటి. ఐతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. బోయపాటి తన ఏ సినిమాకు కూడా స్క్రిప్టు రాసేటపుడు క్లైమాక్స్ పూర్తి చేయడు. సినిమా మొదలయ్యాక.. కొన్నాళ్లు షూటింగ్ అయ్యాక మధ్యలో గ్యాప్ తీసుకుని.. క్లైమాక్స్ రాసుకుంటాడు. దీనికి కారణం ఏంటో బోయపాటి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘నేను నా ప్రతి సినిమాకూ స్క్రిప్టు కోసం కనీసం నాలుగు నెలలు టైం తీసుకుంటాను. వందశాతం బౌండ్ స్క్రిప్టు రెడీ అయ్యాకే షూటింగుకి వెళ్తాను. ఐతే అన్నీ పూర్తి చేసినా క్లైమాక్స్ మాత్రం ఆపుతాను. మిగతా సీన్లన్నీ చూసుకున్నాక ముగింపు జోలికి వెళ్తాను. అప్పటి వరకు వచ్చిన సినిమా చూశాక.. క్లైమాక్స్‌ తీవ్రత పెంచాలా.. తగ్గించాలా అన్నది నిర్ణయం తీసుకుంటా. నా ప్రతి సినిమాకు ఇలాగే చేస్తాను. ఎందుకో ఆ అలవాటే కుదిరింది’’ అని బోయపాటి చెప్పాడు.

తన సినిమాల్లో హింస ఎక్కువ అన్న విమర్శలపై స్పందిస్తూ.. ‘‘నా సినిమాలో ఎమోషన్ లేకుండా యాక్షన్ ఉండదు. ఎమోషన్‌ లాక్‌ అయిన చోట ప్రేక్షకుడు కూర్చుంటాడు. థియేటర్‌ లో కూర్చున్న ప్రేక్షకుడికి ‘కొట్టు.. కొట్టు..’ అన్న ఫీలింగ్ వచ్చినపుడే నా సినిమాల్లో హీరో విలన్‌ ను కొడతాడు. అంతేకానీ.. కావాలని హింసను జొప్పించను’’ అని బోయపాటి తెలిపాడు.
Tags:    

Similar News