బర్త్ డే స్పెషల్ : 'విక్టరీ'నే ఇంటి పేరుగా మార్చుకున్న వెంకీమామ..!

Update: 2020-12-13 03:20 GMT
టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ కి ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది. మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా పరిచయమైనా.. ఒక సక్సెస్‌ ఫుల్ హీరోగా ఎదగడానికి చాలానే కష్టపడ్డాడు. 'కలియుగ పాండవులు' సినిమాతో తెరంగేట్రం చేసిన వెంకటేష్.. కెరీర్ స్టార్టింగ్ నుండి తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. స్టార్ డమ్, ఇమేజ్ లను పక్కన పెట్టి మంచి కథాబలం ఉండే సినిమాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నాడు. ఓ వైపు కుటుంబ కథా చిత్రాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన వెంకీ.. మరోవైపు యాక్షన్ ఎంటర్టైనర్స్ లో నటిస్తూ మాస్ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తున్నాడు.

'చంటి' 'సుందరకాండ' 'ధర్మచక్రం' 'పవిత్రబంధం' 'కలిసుందాం రా' 'పెళ్లి చేసుకుందాం' 'జయం మనదేరా' 'నువ్వు నాకు నచ్చావ్' 'ఘర్షణ' 'మల్లీశ్వరి' 'లక్ష్మీ' 'తులసి' వంటి చిత్రాలు వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాతో మల్టీస్టారర్స్ కి మార్గం వేసిన వెంకటేశ్.. 'ఎఫ్ 2' సినిమాతో రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టాడు. గతేడాది చివర్లో తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్య తో కలిసి 'వెంకీమామ' సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం 'అసురన్' అనే తమిళ్ చిత్రానికి రీమేక్ గా 'నారప్ప' చిత్రం చేస్తున్నాడు వెంకీ. అలానే 'ఎఫ్ 2' సీక్వెల్ 'ఎఫ్ 3' లో కూడా నటించనున్నాడు.

ఇలా తన 30 ఏళ్ల సినీ కెరీర్‌ వెంకటేష్ ఎన్నో అవార్డులను కైవసం చేసుకొని ఎన్నో రికార్డులను తిరగరాసి 'విక్టరీ' వెంకటేష్ గా పిలవబడుతున్నాడు. ఇప్పటివరకు 74 సినిమాలు చేసిన వెంకీ.. 7 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్స్ మరియు 5 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నాడు. ఇక న్యూ టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటాడు. మూస ధోరణిలో వెళ్లకుండా వినూత్నమైన చిత్రాలను తీస్తూ మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్నాడు. 'విక్టరీ'నే తన ఇంటి పేరుగా మార్చుకున్న వెంకీ రేపటితో (డిసెంబర్ 13) 60వ వసంతాలు పూర్తి చేసుకోనున్నారు. వెంకటేష్ అదే ఎనర్జీతో మరెన్నో వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటూ 'తుపాకీ డాట్ కామ్' ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
Tags:    

Similar News