‘దేవినేని’ బయోపిక్.. మొదలైన రాజకీయ వివాదం!

Update: 2021-02-17 07:36 GMT
టాలీవుడ్ లో బ‌యోపిక్ ల హ‌వా కొన‌సాగుతూనే ఉంది. తాజాగా.. మ‌రో బ‌యోపిక్ తెర‌కెక్కుతోంది. బెజ‌వాడలో ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు దేవినేని నెహ్రూ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘దేవినేని’. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు న‌ర్రా శివ‌నాగేశ్వ‌ర‌రావు రూపొందిస్తున్నారు. జీఎస్ఆర్‌, రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. నందమూరి తారకరత్న టైటిల్‌ పాత్రలో క‌నిపిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమాపై వివాదం నెల‌కొంది.

నిజ జీవితంలో దేవినేని నెహ్రూ, వంగ‌వ‌టి రంగా మ‌ధ్య‌ ఆధిప‌త్య పోరు కొన‌సాగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో దాడులు, ప్ర‌తిదాడులు.. హ‌త్య‌లు అనేకం జ‌రిగిన సంగ‌తి కూడా తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌ల్లో ఇరు వైపు కుటుంబ స‌భ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే.. అంతా ప్ర‌శాంతంగా ఉన్న ఈ స‌మ‌యంలో ఇలాంటి చిత్రాల వ‌ల్ల పాత క‌క్ష‌లు చెల‌రేగుతాయ‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోది.

దేవినేని సినిమాలో.. తార‌క‌ర‌త్న నెహ్రూ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. వంగ‌వీటి రాధ పాత్ర‌లో న‌టుడు బెన‌ర్జీ, వంగ‌వీటి రంగా పాత్ర‌లో సురేష్ కొండేటి, చ‌ల‌సాని వెంక‌ట‌ర‌త్నం పాత్ర‌లో తుమ్మ‌ల ప్ర‌స‌న్న‌కుమార్‌, కేఎస్ వ్యాస్ పాత్ర‌లో సంగీత ద‌ర్శ‌కుడు కోటి న‌టిస్తున్నారు.

కాగా.. ఈ సినిమాపై దేవినేని నెహ్రూ త‌న‌యుడు, వైసీపీ ‌నేత దేవినేని అవినాష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  త‌మ అనుమ‌తి లేకుండా త‌న తండ్రి జీవిత క‌థ‌ను తెర‌కెక్కించ‌డంపై మండిప‌డ్డారు. వెంట‌నే సినిమాను నిలిపివేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ విష‌య‌మై సినిమా నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు అవినాష్‌.

గ‌తంలో వంగ‌వీటి జీవిత క‌థ ఆధారంగా వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ‘వంగవీటి’ పేరుతో సినిమాను తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో వంగ‌వీటి కుమారుడు రాధా కూడా అభ్యంత‌రం తెలిపారు. ఆ త‌ర్వాత సర్దుబాటు జరిగింది. మరి, దేవినేని సినిమా ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News