అవును.. అమెరికా అధ్యక్షుడు చేపలు పట్టారు

Update: 2015-09-04 05:34 GMT
అమెరికా అధ్యక్షుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ భూమండలం మీద అత్యంత పవర్ ఫుల్ వ్యక్తి. అలాంటి వ్యక్తి సెలవురోజుల్ని ఎలా గడుపుతారు? ఏం చేస్తారు? అసలు అలాంటి వ్యక్తికి సెలవులు అంటూ ఉంటాయా? లాంటి డౌట్లు చాలానే వస్తుంటాయి. కానీ.. ఒబామా గురించి తెలిసిన వారికి మాత్రం సెలవుల్ని ఆయన ఎంతగా ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అమెరికా అధ్యక్షుడ్ని అన్న భావన లేకుండా.. చాలా సామాన్యంగా వ్యవహరిస్తూ.. ఆయన చేసే పనులు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. డాబు.. బడాయిల్ని విడిచిపెట్టి.. ఒక సామాన్యుడి మాదిరి ఆయన సెలవుల్ని ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా.. ఆయన తన సెలవుల్ని ఎంజాయ్ చేశారు. మరి.. సెలవుల సందర్భంగా ఒబామా ఏం చేశారో చూస్తే..

అర్కెటిక్ దృవప్రాంతానికి దగ్గరగా ఉండే అమెరికా రాష్ట్రం అలాస్కా. ఆ రాష్ట్రంలో తన మూడు రోజుల సెలవుల్ని ఒబామా గడిపారు. ఈ సందర్భంగా ఆయన.. అక్కడ ప్రపంచ ప్రసిద్ది చెందిన సాల్మన్ చేపలకు పెట్టింది పేరు అయిన డెలింగ్ హమ్ లో తన సెలవుల్ని స్టార్ట్ చేశారు. అక్కడ చేపల్ని పట్టిన ఆయన.. ఆ తర్వాత ఒక స్కూలుకు వెళ్లి.. చిన్నారులతో కలిసి ఆడి పాడారు. వారితో కబుర్లు చెప్పి సంతోషంగా గడిపేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఒక వ్యక్తి ఇంత సాదాసీదాగా గడపటం కాస్తంత విశేషమే కదూ.
Tags:    

Similar News