పవర్ స్టార్ తో ఏడాది పండగ చేసుకునే సినిమా తీస్తా...!

Update: 2020-07-19 10:22 GMT
సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - నిర్మాత నటుడు బండ్ల గణేష్ కి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేను పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ని కాదు భక్తుడిని అని అనేక సందర్భాల్లో చెప్పాడు బండ్ల గణేష్. కమెడియన్ స్థాయి నుండి స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో 'తీన్ మార్' సినిమా నిర్మించాడు. ఈ సినిమా పరాజయం పాలైనా పవన్ పిలిచిమరీ 'గబ్బర్ సింగ్' సినిమాకి ప్రొడ్యూసర్ గా బండ్ల గణేష్ కి బాధ్యతలు అప్పగించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో పాటు అప్పటివరకు పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే 'గబ్బర్ సింగ్' తర్వాత వీరి కాంబినేషన్లో మళ్ళీ సినిమా రాలేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు ఓకే చేస్తుండటంతో బండ్ల గణేష్ మరోసారి ఆయనతో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.  

కాగా ఈ రోజు బుల్లితెరపై 'గబ్బర్ సింగ్' టెలికాస్ట్ అవుతున్న సందర్భంగా ఓ నెటిజన్ 'పవన్ కళ్యాణ్ - బండ్ల గణేష్ - హరీష్ శంకర్ కలిసి ఇలాంటి సినిమా మళ్ళీ ఇస్తారని ఆశిస్తున్నామని' ట్వీట్ చేసి హరీష్ శంకర్ - బండ్ల గణేష్ లను ట్యాగ్ చేసాడు. దీనిపై స్పందించిన ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మళ్లీ పవర్ స్టార్‌ తో సినిమా తీస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ''ఆ పరమేశ్వరుడు మళ్లీ నాకు పవర్ స్టార్‌ తో సినిమా నిర్మించే అవకాశం ఇస్తే నేను తప్పకుండా చేస్తాను. మన పవర్ స్టార్ అభిమానులు సంవత్సరం పాటు పండగ చేసుకునే విధంగా సినిమా తీస్తా. ఇది నా సంకల్పం'' అని పేర్కొన్నారు. కాగా పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో 28వ చిత్రంగా రానున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. దీంతో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' మరియు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో పవన్ నటిస్తున్నాడు.
Tags:    

Similar News