సీఎం సార్ ని ఇంత‌గా కాకా ప‌ట్టాలా బండ్లా?

Update: 2020-04-12 06:07 GMT
న‌టుడు - నిర్మాత బండ్ల గ‌ణేష్ వేదిక‌ల‌పై ప్ర‌సంగిస్తే.. ఎంట‌ర్ టైన్ మెంట్ కి కొద‌వేమీ ఉండ‌దు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నా దేవుడు! అంటూ తొలిగా త‌న‌ని గుర్తు చేసుకుంటాడు. అటుపై ఎంత దూరం వెళ్తాడో ఆయ‌న‌కే తెలియ‌దు. ప‌వ‌న్ పై అంత అభిమానం చూపించే ఏకైక నిర్మాత బండ్ల అన్న పేరు కొట్టేశాడు‌. అయితే నిర్మాత‌గా కొన్ని ఫ్లాపుల వ‌ల్ల కొన్నాళ్ల పాటు రాజ‌కీయాలు చేసిన గణేష్ అక్కడా విఫ‌ల‌మ‌వ్వడంతో మ‌ళ్లీ కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా సినిమాలు నిర్మించే ప్ర‌య‌త్నాల్లో  ఉన్నాడు. అయితే ఆయ‌న‌గారి గ‌త ఘ‌న‌కార్యాల కార‌ణంగా హీరోలెవ్వ‌రూ అవ‌కాశాలివ్వడం లేదు. ఇక కొవిడ్ 19 స‌హా స‌మ్మ‌ర్ హీట్ వ‌ల్ల‌ గ‌ణేష్ పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ‌ పెద్ద‌ దెబ్బ తింది. దీంతో గణేష్ కి బాగా న‌ష్టాలొచ్చాయట‌. వాట‌న్నింటినీ సినిమాలు తీసి క‌వ‌ర్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడట‌.

ప్ర‌స్తుతం లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న నేప‌థ్యంలో జ‌నాలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ్యారు. ఎప్ప‌టిక‌ప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష‌లు నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌ణేష్ ముఖ్య‌మంత్రిని బాగా జోకొట్టే పనిలో బిజీ అవ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది. బండ్ల ఏమ‌నుకున్నాడో ఇటీవ‌ల‌ వ‌రుస ట్వీట్ల‌తో కేసీఆర్ మ‌న‌సు గెలిచే ప‌ని పెట్టుకున్నాడు. తాజాగా కేసీఆర్ ని ఉద్దేశించి గ‌ణేష్ ఏమ‌ని ట్వీట్ చేసాడంటే? ``మా కోసం మా పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం నిర్ణ‌యాల్లో స‌రిలేరు నీకెవ్వ‌రు గౌర‌వ ముఖ్య‌మంత్రి కేసీఆర్  గారు. నాలుగు రోజులు కాదు సార్. .40 రోజులైనా మీ పైన భ‌రోసాతో ఇళ్ల‌కే ప‌రిమిత‌మై క‌రోనాపై విజ‌యం సాధిస్తాం`` అంటూ కామెడీ టోన్ తో సీరియ‌స్ విష‌యాన్ని వినిపించాడు.

మీరు చేసే ప్ర‌తిదీ ఆ భ‌గవంతుడి ద‌య‌తో జ‌య‌ప్ర‌దం కావాల‌ని కోరుకుంటున్నా. క‌ష్టాలైనా భ‌రిస్తాం. ఎన్ని రోజులైనా ఎదురుచూస్తాం మీరు ఉన్నార‌నే న‌మ్మ‌కంతో..ర‌క్షిస్తారానే భ‌రోసాతో. జై కేసీఆర్ అంటూ ఓ రేంజ్ లో ప్ర‌శంస‌లు కురిపించాడు. దీంతో నెటిజ‌నులు గ‌ణేష్ ను ఆడుకోవ‌డం  మొద‌లు పెట్టారు. ఎప్పుడూ లేని గ‌ణేష్.. గులాబీ ద‌ళానికి ఎదురెళ్లిన గ‌ణేష్ ఇలా మారిపోయాడేంటి? అంటూ ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్య‌మంత్రి గారి ద‌య నీ మీద ఉండుగాక అంటూ దీవిస్తున్నారు. ఇక‌పోతే తెలంగాణ‌లో పౌల్ట్రీ దెబ్బ తిన‌కుండా సీఎం కేసీఆర్ స‌హా మంత్రులు చికెన్ తిన‌మ‌ని పాజిటివ్ గా ప్ర‌చారం చేయిస్తున్న సంగ‌తి తెలిందే.




Tags:    

Similar News