ఆ మాటకు జమున నోరు మూసిన బాలయ్య!

Update: 2018-12-22 04:51 GMT
ముందు నుండి అంటున్నట్లుగానే, ప్రచారం జరిగినట్లుగానే ‘ఎన్టీఆర్‌’ ఆడియో విడుదల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులు అంతా కూడా తరలి వచ్చారు. ఎన్టీఆర్‌ కూతుర్లు అయిన లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరిల చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల అయ్యింది. ఈ కార్యక్రమంలో అప్పట్లో ఎన్టీఆర్‌ తో నటించిన పలువురు హీరోయిన్స్‌ కూడా హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో హాజరు అయిన జమున మాట్లాడుతూ బాలయ్యపై ప్రశంసలు కురిపించారు.

ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రుల పేర్లను పిల్లలు నిలబెట్టడం ఈ కాలంలో చాలా తక్కువగా చూస్తున్నాం. తల్లిదండ్రుల పరువు తీస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. కాని బాలకృష్ణ మాత్రం తండ్రి పేరు నిలబెట్టాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడే కాదు, తండ్రిని మించిన తనయుడు అంటూ జమున అనబోతున్న సమయంలో ఆమె నోరును తన చేతితో మూసే ప్రయత్నం చేశాడు. అంత మాట అనొద్దమా అంటూ ఆమెతో బాలయ్య అన్నాడు. నోటికి చేయి అడ్డు తీసిన తర్వాత తండ్రిని మించిన తనయుడు ఎందుకు అంటున్నానంటే ఎన్టీఆర్‌ గారు ఎన్నో అద్బుతమైన పాత్రలు చేశారు. అంతటి వ్యక్తి గురించి ఈ సినిమాను చేయడం నిజంగా గొప్ప విషయం అంటూ జమున చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌ గారి జీవిత చరిత్రను ఈతరం వారికి చూపించడం అనేది బాలయ్య బాబు చేస్తున్న పెద్ద సాహసంగా ఆమె అభివర్ణించింది. తప్పకుండా తన ఆశీస్సులు ఉంటాయని చెప్పుకొచ్చింది.

ఏయన్నార్‌ పాత్ర పోషించిన సుమంత్‌ మాట్లాడుతూ... తాతయ్య పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నాను, ఇదొక భాద్యతగా తీసుకుని నేను చేశాను. నందమూరి ఫ్యాన్స్‌ అందరికి నా తరపున అభినందనలు తెలుపుతున్నాను. నందమూరి, అక్కినేని ఫ్యామిలీల మద్య చాలా సంవత్సరాల క్రితం బంధం ఏర్పడినది, ఆ బంధంకు మూలం ఎక్కడ, ఎలా మొదలైంది అనేది ఈ సినిమాలో ఉంటుందని సుమంత్‌ అన్నాడు.

విద్యాబాలన్‌ మాట్లాడుతూ... తెలుగులో నాకు ఇది మొదటి సినిమా, ట్రైలర్‌ చూసిన తర్వాత నాకు నేను చాలా ఎమోషనల్‌ అయ్యాను. తెరపై కనిపించేది నిజంగా బాలకృష్ణ గారేనా అన్నట్లుగా ఉంటుందని, పూర్తిగా ఆయన ఇన్వాల్వ్‌ అయ్యి, ఎన్టీఆర్‌ లా మారి పోయి నటించారని చెప్పుకొచ్చింది. బాలకృష్ణ గారికి సినిమా అంటే ఫ్యాక్షన్‌ అని, ఆయన ఎనర్జి నిజంగా గ్రేట్‌ అంది. ఇలాంటి సినిమాలో నేను నటించడం గర్వంగా ఉంది. ఈ సినిమా వల్ల బాలకృష్ణ గారి ఫ్యామిలీకి మా ఫ్యామిలీ చాలా దగ్గర అయ్యింది. ఇదో గొప్ప సినిమాగా నిలుస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.

జయసుధ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ గారి బయోపిక్‌ తీస్తున్నారనగానే నేను కాస్త అనుమానం పడ్డా. ఎలా తీస్తారో, ఏం చూపిస్తారో అనుకున్నాను. ఆయనతో నేను 20 సినిమాు చేసే అవకాశం దక్కించుకుని అదృష్టవంతురాలిని అయ్యాను. అంతటి గొప్ప నటుడి సినిమాను వీరు గొప్పగా చూపించగలా అనుకున్నాను. కాని ఫస్ట్‌ లుక్‌ చూడగానే ఖచ్చితంగా ఇది ఎన్టీఆర్‌ గారిని ఆవిష్కరిస్తుందనిపించింది. ఫస్ట్‌ లుక్‌ లో నిజంగా ఎన్టీఆర్‌ గారా అని అనుమానం కలిగింది. అంతగా ఎన్టీఆర్‌ పాత్రకు బాలయ్య ఒదిగి పోయారు. తప్పకుండా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

రానా మాట్లాడుతూ... బాలయ్యగారి కథానాయకుడు సినిమా విడుదలైన డిసెంబర్‌ 14, 1984న నేను పుట్టాను. నేను చూసిన మొదటి షూటింగ్‌ కూడా బాలకృష్ణ గారిదే, ఆయన నటించిన ‘రాము’ సినిమా మా ఇంట్లో చిత్రీకరణ జరిపారు. అలా ఆయనతో నాకు చక్కని అనుబంధం ఏర్పడినది. ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు గారి పాత్రను చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఆయన హెల్ప్‌ వల్లే నా పాత్ర బాగా వచ్చిందన్నాడు.

రకుల్‌ మాట్లాడుతూ.. శ్రీదేవి గారి పాత్రలో నటించడం అనేది నాకు దక్కిన గొప్ప గౌరవంగా ఫీల్‌ అవుతున్నాను. ఇంతటి గొప్ప చిత్రంలో నటించేందుకు ఛాన్స్‌ ఇచ్చిన క్రిష్‌ మరియు బాలకృష్ణ గార్లకు కృతజ్ఞతలు. బాలకృష్ణ గారు శ్రీదేవిగారితో సినిమాలు చేయలేదు, కాని ఈ సినిమాలో చేశారంటూ సరదాగా కామెంట్‌ చేసింది. నేను బాగా చేశానా లేదా అనేది బాలయ్య గారు చెప్పాలి అంటూ రకుల్‌ నవ్వుతూ కామెంట్‌ చేసింది.

కృష్ణం రాజు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ గారు చాలా గొప్ప మనిషి, ఆయన సినిమా తీసినందుకు బాలకృష్ణను ఎలా అభినందించాలో తెలియడం లేదు. నేను ఒకసారి నా సినిమా  వేడుకకు పిలిచినప్పుడు షూటింగ్‌ క్యాన్సిల్‌ చేసుకుని మరీ వచ్చారు. ఒకసారి ప్లైట్‌ లో ఊటికి వెళ్తున్న సమయంలో పార్టీ పెట్టాలనుకుంటున్నట్లుగా చెప్పారు, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఇకపై పని చేయాలని భావిస్తున్నట్లుగా నాతో చెప్పారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు. ఈ ఫంక్షన్‌ కు రావడం నా అదృష్టం కూడా అన్నాడు.

పురందేశ్వరి మాట్లాడుతూ.. బాలకృష్ణ నా కంటే చిన్న వాడు అవ్వడం వల్ల నమస్కారం పెట్టడం లేదు, ఆశీర్వాదం అయితే ఇస్తున్నాను. నందమూరి కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా తెలుగు వారంతా కూడా గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్‌. తెలుగు జాతికి గుర్తింపును తీసుకు వచ్చిన ఆయన ఒక మహానాయకుడు, కథానాయకుడు. నాన్న గారి గురించిన ప్రతి విషయం కూడా తెలుగు వారికి తెలుసు. అలాంటి ఆయన జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకోవడం అతి పెద్ద సాహసం. అలాంటి సాహసం చేసినందుకు తమ్ముడు బాలకృష్ణను అభినందిస్తున్నాను. నాన్న గారు గుర్తొచ్చే విధంగా తమ్ముడి ఆహార్యం మరియు బాడీలాంగ్వేజ్‌ ఉంది. మా తల్లిగారి పాత్రలో విద్యాబాలన్‌ గారు నటించారు. ఆమెకు కృతజ్ఞతలు. ఆమె జీవించారు. దర్శకుడు క్రిష్‌ తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులందరికి కూడా శుభాకాంక్షలు చెప్పింది.

కృష్ణ మాట్లాడుతూ.. నేను చిన్నప్పటి నుండి ఎన్టీఆర్‌ గారి అభిమానిని, నేను డిగ్రి పూర్తి చేసిన తర్వాత చెన్నై వెళ్లి ఆయన్ను కలిశాను. నాకు నటించాలని ఆసక్తి ఉంది, నాకు మీ సినిమాల్లో ఆఫర్లు ఇవ్వండి అని అడిగాను. అయితే నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి, సినిమాలకు మరో రెండు మూడు సంవత్సరాలు ఆగు అన్నారు. ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు నన్ను హీరోగా పరిచయం చేశారు. నేను పలు సినిమాల్లో ఆయనతో కలిసి నటించాను. అన్ని సినిమాల్లో కూడా ఆయనకు తమ్ముడిగా నటించాను. బయోపిక్‌ కు సంబంధించిన కొన్ని ఫొటోలు నాకు బాలకృష్ణ చూపించాడు. చాలా బాగున్నాయి. వందకు వంద శాతం ఎన్టీఆర్‌ లాగే బాలకృష్ణ కనిపించారు. ఈ చిత్రం అద్బుత విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

Tags:    

Similar News