ఎన్టీఆర్ బయోపిక్‌ పై బాలయ్య క్లారిటీ

Update: 2017-06-11 07:00 GMT
తన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత కథతో సినిమా చేయబోతున్నట్లు గత ఏడాది బాలకృష్ణ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. స్వయంగా తానే తన తండ్రి పాత్ర పోషిస్తానని.. ఇందుకోసం గ్రౌండ్ వర్క్ మొదలైందని బాలయ్య అప్పట్లో చెప్పాడు. ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లుగా బాలయ్య ఆ ప్రకటన చేశాడో లేదో.. రకరకాల వివాదాలు.. చర్చలు మొదలయ్యాయి. ఐతే బాలయ్య ఆ తర్వాత మళ్లీ ఆ ఊసే ఎత్తలేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై కొంత సందేహాలు నెలకొన్నాయి. ఐతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య.. ఎన్టీఆర్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని.. దీనికి సంబంధించి పని నడుస్తోందని చెప్పాడు.

‘‘ఒక అసలు సిసలు మహానుభావుడి మీద ఒక మహత్తర చిత్రంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నాం. ఆ సినిమాలో నాన్న గారి గురించి చాలామందికి తెలియని అంశాలు..విశేషాలు కూడా చూపిస్తాం. ప్రస్తుతం నేను పోర్చుగల్ లో ‘పైసా వసూల్’ షూటింగులో పాల్గొంటున్నా. ఇండియాకు వచ్చాక స్ర్కిప్ట్ వర్క్ కోసం చాలామందిని మరోసారి కలవబోతున్నాను. నాన్న గారి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ గారినీ.. నాన్న గారితో అనుబంధమున్న అప్పటి మరో ఐఏఎస్‌ అధికారి జయప్రకాష్ నారాయణ గారిని.. నాన్న గారి సినీ రాజకీయ జీవిత విశేషాలు.. బాక్సాఫీస్‌ రికార్డులు నోటి మీద చెప్పే మా సినిమా మనిషి కొమ్మినేని వెంకటేశ్వరరావు లాంటి వాళ్లను సంప్రదించి స్ర్కిప్టు సిద్ధం చేస్తాం. మా కుటుంబ సభ్యులను.. బంధువులను.. అభిమానుల్ని కూడా కలవాలి. ఆ సినిమాకు దర్శకుణ్ణి కూడా ఖరారు చేసే పనిలో ఉన్నా. నాన్నగారి గొప్పదనాన్ని తెలియజెప్పేలా స్ర్కిప్టు పక్కగా రెడీ కాగానే.. వెంటనే సెట్స్‌ మీదకు వెళ్లిపోతాం. నాన్న గారి మీద సినిమా తీసి.. నటించి.. కొడుకుగా నా రుణం కొంతైనా తీర్చుకోవాలనుకుంటున్నా’’ అని బాలయ్య తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News