చరణ్‌ విలన్‌ చెప్పింది నిజమేగా

Update: 2016-06-18 04:31 GMT
''మీకు నచ్చిన వారికి అవార్డును ఇవ్వండి. అంతేగాని.. పోల్‌ అంటూ పెట్టేసి.. మరొక నటుడిని తక్కువ చేసి మాట్లాడొద్దు. నటుడు అనేవాడు ఎవడైనా కూడా అద్భుతంగా నటించడం కారణంగానే ఫీల్డులో ఉంటున్నాడు'' అంటూ మండిపడ్డాడు హ్యాండ్సమ్ మాజీ హీరో అరవింద్‌ స్వామి. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ సరసన ''ధృవ'' సినిమాలో చేస్తున్న ఈ సీనియర్‌ స్టార్‌.. తమిళనాట జరిగే అవార్డుల తంతును ఖండించాడు.

ప్రస్తుతం ఫిలింఫేర్‌.. సైమా.. వంటి సంస్థలు తమ అవార్డుల కార్యక్రమాన్ని ప్రకటించేశాయి. ఇందులో తమిళ క్యాటగిరీలో ఉత్తమ విలన్‌ గా ''థని ఒరువన్‌'' సినిమాలోని నటనకు గాను అరవింద్ స్వామి నామినేట్‌ అయ్యాడు. అయితే ఇలా వేరే నటులతో పోటీలో ఉంచి.. వాటికి మళ్లీ ఆన్ లైన్ లో పోల్స్ అంటూ పెట్టి.. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తున్నాయో చెబుతూ.. అలా పక్క నటుల్ని అవమానపరచొద్దు అంటున్నాడు స్వామి. అదీ నిజమే కదా. కొందరు నటులకు ఆన్ లైన్లో యాక్టివ్ గా ఉండే అభిమానులు ఎక్కువమంది ఉండొచ్చు. వారు తెగ ఓట్లు వేసేయొచ్చు.. అందువలన పోటీలో ఉన్న మిగతా నటులు సరిగ్గా పెర్ఫామ్‌ చేయలేదని చెప్పలేంగా.

ఏదేమైనా అవార్డులు తీసుకోవడానికి అరవింద్‌ వస్తాడో రాడో తెలియదు కాని.. ఈ కామెంట్లు మాత్రం ఒక రేంజులో చిచ్చురేపాయి.
Tags:    

Similar News