అభిమానులను టెన్షన్ పెట్టేస్తున్న అనుష్క

Update: 2021-03-05 07:30 GMT
వెండితెరపై పండు వెన్నెల ఆరబోసినట్టుగా .. నవరసాలు విరబూసినట్టుగా కనిపించే కథానాయిక అనుష్క. మచ్చలేని చందమామలా .. కందిపోయే కలువభామలా అనిపించే అనుష్క అంటే ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. సాధారణ ప్రేక్షకుల్లోనే కాదు .. దక్షిణాది భాషల్లోని ఇతర హీరో హీరోయిన్లు కూడా తాము ఆమె అభిమానులుగా చెప్పుకోవడం విశేషం. అందానికి అందం .. అభినయానికి అభినయం. అనుష్క విషయంలో ఈ రెండిటినీ తూచి చెప్పడం చాలా కష్టం. అంతలా తన అందమైన అభినయంతో ఆమె ప్రేక్షకులను మెప్పించింది .. వాళ్ల మనో ఫలకాలపై తన రూపాన్ని ముద్రించింది.

అనుష్క ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకూ చాలామంది కథానాయికలు తెలుగు తెరకి పరిచయమయ్యారు. కానీ అలాంటి చక్కని కనుముక్కు తీరున్నవాళ్లు మాత్రం కనిపించరు. జానపద .. చారిత్రక .. పౌరాణికాలకు తగిన రూపం అనుష్క సొంతం. కెరియర్ తొలినాళ్లలో తెరపై భారీ అందాలను ఆరబోసిన అనుష్క, ఆ తరువాత నటనతోనే కెరియర్ ను నడిపిస్తూ వచ్చింది. 'అరుంధతి' .. 'బాహుబలి' .. 'రుద్రమదేవి' .. 'భాగమతి' సినిమాలు ఆమె నటనకు నిదర్శనమై కనిపిస్తాయి .. నిర్వచనమై నిలుస్తాయి.

అలాంటి అనుష్క 'సైలెన్స్' సినిమా తరువాత సైలెంటై పోయింది. లావైన కారణంగా సినిమాలు తగ్గించిందనే టాక్ వినిపించిందిగానీ అందులో నిజం లేదు. అనుష్క ఎంత లావైనా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఆమె ముఖం చంద్రబింబమే .. అసలైన సౌందర్యానికి ప్రతిబింబమే. అందువలన ఆమె క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక సరైన కథల కోసమే అయినా, అనుష్క ఇంత గ్యాప్ తీసుకోకూడదు. ఎందుకంటే ఆమె నుంచి రానున్న సినిమాల కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆమె ఉలుకూ పలుకు లేకుండా ఉండటంతో, సినిమాలు మానేస్తుందా ఏంటి? అనుకుని బెంగపెట్టేసుకుంటున్నారు. అందువలన వాళ్ల కోసం ఆమె ఒక ట్వీట్ మీటవలసిన అవసరమైతే ఉంది.




Tags:    

Similar News