అజ్ఞాతవాసితో కనుమరుగై.. మళ్లీ ఇప్పుడు..

Update: 2018-07-20 07:47 GMT
ఒక్క ఫ్లాప్.. సినిమా ఇండస్ట్రీలో పరిస్థితిని తలకిందులు చేస్తుంది. హిట్ అయితేనే క్రేజ్.. ఫ్లాప్ అయితే మాత్రం కనీసం పట్టించకునే వారు ఉండరు. ఈ లాజిక్ తెలుసు కనుక దర్శకులు - హీరోలు కష్టపడి పనిచేస్తారు. ఫ్లాపులు వచ్చినా కానీ దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. కానీ కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవారికి మాత్రం తొలిసారి ఫ్లాప్ వస్తే తట్టుకోవడం చాలా కష్టం.. ఇప్పుడా కష్టం అనిరుద్ రవిచంద్రన్ కు వచ్చింది. అవును.. అతడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ మూవీతో తెలుగులో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అవకాశాలు కోల్పోయాడు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాకు అనిరుధ్ ఓకే అయినా తరువాత అతడిని తీసేశారు. ఇలా అజ్ఞాతవాసితో ఎక్కువగా మునిగిపోయింది అనిరుధ్ రవిచంద్రనే.. ఇటు త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. అటు పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి ఫుల్ టైం పొలిటీషన్ గా మారిపోయాడు. ఎటూ తిరిగి అనిరుధ్ రవిచంద్రన్ మాత్రమే అన్యాయమైపోయాడు.

నిజానికి అనిరుధ్ ఏమీ అవకాశాలు లేకుండా ఖాళీగా ఏం లేడు. తమిళనాట అగ్ర హీరోల సినిమాలకు చేస్తూ క్రేజీ సంగీత దర్శకుడిగా వెలుగొందుతున్నాడు. పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. కానీ పాపం తెలుగులో కూడా హిట్ కొట్టి దక్షిణాదిలో నంబర్ 1 అనిపించుకుందామని అనిరుద్ కన్న కలలు కల్లలయ్యాయి.

టాలీవుడ్ లో మొదటి సినిమా ఫ్లాప్ తో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అనిరుధ్ కు ఇప్పుడు పిలిచి మరీ చాన్స్ ఇచ్చాడు హీరో నాని. తన నెక్ట్స్ ప్రాజెక్టు కు అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న జెర్సీ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అలా టాలీవుడ్ ను లైట్ చేసుకున్న అనిరుధ్.. జెర్సీ స్టోరీ నచ్చడంతో మరోసారి తెలుగులో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఈ సినిమాతోనైనా అనిరుధ్ తలరాత మారుతుందో లేదో చూడాలి.
Tags:    

Similar News