అదరగొట్టేస్తున్న 'అనేక్' ట్రైలర్!

Update: 2022-05-05 15:28 GMT
మొదటి నుంచి కూడా ఆయుష్మాన్ ఖురానా విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. కొత్తగా కనిపించడానికీ ... కొత్తగా అనిపించడానికి ఉత్సాహాన్ని చూపు తున్నాడు. ఆ మధ్య ఆయన చేసిన 'ఆర్టికల్ 15' గురించి అంతా మాట్లాడుకున్నారు. ఒక సామజిక సమస్యకి సంబంధించిన కథా నేపథ్యం కంటెంట్ లో ఆయన బాగా చేస్తాడని చెప్పుకున్నారు. ఈ తరహా కథల్లో తన పాత్రను సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళతాడనే పేరు తెచ్చుకున్నాడు. ఆయన నుంచి వస్తున్న మరో సినిమానే 'అనేక్'.

'ఆర్టికల్ 15' దర్శకుడు అనుభవ్ సిన్హా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ కథలో దేశానికి సంబంధించిన ఒక సమస్యను పరిష్కరించడంలో ఆయన ఎలాంటి పాత్రను పోషించాడనేది చూపడం జరుగుతుంది. నార్త్ ఈస్ట్ రీజియన్ కి సంబంధించిన ఒక సమస్య దేశ భద్రతకు సవాలుగా మారుతుంది. ఆర్మీలో పనిచేస్తున్న హీరో, ఆ ఆపరేషన్ లో భాగంగా  రంగంలోకి దిగుతాడు. ఎప్పటికప్పుడు తన లైఫ్ ను రిస్క్ లో పెట్టే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే హీరో, ఈ విషయంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందనేది కథ.

ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను  ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా  ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అందులో భాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఇటీవల హిందీ భాషకి సంబధించి ఒక రచ్చ మొదలైన సంగతి తెలిసిందే. దానికి సమాధానం అన్నటుగా ఈ సినిమాలో హీరో ఒక డైలాగ్ చెబుతాడు. మనం వచ్చింది సౌత్ ఇండియా నుంచా? నార్త్  ఇండియా నుంచా? అనేది భాష నిర్ణయించదు. అయినా సౌత్ ఇండియానా  .. నార్త్  ఇండియానా  కాదు .. ఉన్నది ఒకటే ఇండియా" అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా ఏ స్థాయిలో సందడి చేస్తుందనేది చూడాలి.
Full View
Tags:    

Similar News