OG క్రేజీ రికార్డు బ్రేక్.. ధురంధర్ 2 ఇంకెన్ని సంచలనాలో..
పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన ధురంధర్: ది రివెంజ్ (ధురంధర్ 2) మూవీ అప్పుడే రికార్డుల వేట ప్రారంభించింది.;
పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన ధురంధర్: ది రివెంజ్ (ధురంధర్ 2) మూవీ అప్పుడే రికార్డుల వేట ప్రారంభించింది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఆ చిత్రంలో స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. రంజాన్, గుడిపడ్వా, ఉగాది పండుగలు పురస్కరించుకుని మార్చి 19న ఆ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
గత సంవత్సరం విడుదలైన ధురంధర్ తొలి భాగం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. దీంతో సీక్వెల్ పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు గానే ధురంధర్ 2 సినిమాను మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండగా.. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
ముఖ్యంగా ప్రీమియర్ షోల బుకింగ్స్ లోనే ధురంధర్ 2 దుమ్మురేపుతోంది. ప్రీమియర్స్ ద్వారా మాత్రమే సుమారు రూ.37.5 కోట్ల వసూళ్లు సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసిందని చెప్పాలి. ఇప్పటివరకు ఆ రికార్డు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG మూవీ పేరుపై ఉన్నట్టు సమాచారం. ఆ సినిమా సుమారు రూ.25 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం.
ఓజీ గత ఏడాది వచ్చి అభిమానులను ఓ రేంజ్ లో అలరించింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆ సినిమాను ఇప్పుడు ధురంధర్ 2 వెనక్కి నెట్టింది. అదే సమయంలో ధురంధర్ సీక్వెల్ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా జోరు తగ్గడం లేదు. ఇప్పటికే రూ.120 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కు ఇంకా రెండు రోజులు ఉండగా.. అప్పుడే భారీ వసూళ్లు వచ్చాయి.
ఆ సంఖ్య రూ.150 కోట్ల మార్క్ ను దాటే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రీమియర్స్ తోపాటు ఫస్ట్ డే కోసం కలిపి సుమారు 10 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. దీంతో ధురంధర్ 2 మూవీ.. రిజల్ట్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ నమోదు చేయడం పక్కా. అంతేకాదు.. కంటెంట్ క్లిక్ అయితే.. ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
ఇక సినిమా విషయానికొస్తే.. జియో స్టూడియోస్, బీ 62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా, ఆదిత్య ధర్ తో పాటు లోకేష్ ధర్, జ్యోతి దేశ్ పాండే నిర్మాతలుగా వ్యవహరించారు. చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్ గా నటించగా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ వంటి ప్రముఖలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, వికాస్ నౌలఖ సినిమాటోగ్రఫీ అందించగా, శివకుమార్ వి పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. బాణీలను శాశ్వత్ సచ్ దేవ్ సమకూర్చారు.