అందరి చూపు డిసెంబర్ 17 వైపే..!

Update: 2021-11-13 01:30 GMT
అల్లు అర్జున్‌ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న యాక్టన్ డ్రామా ''పుష్ప''. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ పండక్కి వారం ముందుగా అంటే డిసెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగానే విడుదల చేస్తే ఇది కరోనా పాండమిక్ తర్వాత థియేటర్లలోకి వచ్చే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అవుతుంది. అయితే ఈ సినిమా ఆ తేదీకి వస్తుందా రాదా అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న 'పుష్ప'సినిమా రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ ను 'పుష్ప: రైజ్' అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. విడుదలకు ఒక నెల రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఈ గ్యాప్ లోనే చిత్రీకరణ పూర్తి చేయాలి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసి ప్రమోషన్స్ ముమ్మరం చేయాలి. పాన్ ఇండియా సినిమా కాబట్టి మిగతా భాషల్లో డబ్బింగ్ చెప్పించడం మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకొని అనుకున్న సమయానికి సినిమాని రిలీజ్ చేయగలరా? అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.

అయితే 'పుష్ప' పార్ట్-1 ఆలస్యమైతే ఆ తేదీకి రావాలని మరికొన్ని సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' చిత్రాన్ని ముందుగా డిసెంబ‌ర్ 17న విడుదల చేయాలని గట్టిగానే ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. వీలు కుదరకపోవడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరికి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు 'పుష్ప' చెప్పిన డేట్ కి రాకపోతే మాత్రం.. సినిమా రెడీగా ఉంది కాబట్టి 'ఆచార్య' ను తీసుకెచ్చే అవకాశం ఉందని టాక్ వచ్చింది.

అలానే 'పుష్ప' తప్పుకుంటే వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గని' సినిమా కూడా ఆ డేట్ కి రావాలని చూస్తోందట. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ బన్నీ సినిమా కనుక వాయిదా పడితే క్రిస్మస్ సీజన్ ను క్యాష్ చేసుకునేలా 'గని' ప్రణాళికలు రచిస్తున్నారని అంటున్నారు. వీటితోపాటుగా బాలకృష్ణ-బోయపాటి శ్రీను ల 'అఖండ' కూడా ఆ తేదీ కోసం చూసే అవకాశం ఉంది.

కాకపోతే 'పుష్ప' చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తే ఇప్పట్లో మంచి రిలీజ్ డేట్ దొరికే పరిస్థితి లేదు. ఎక్కువ రోజులు వాయిదా వేయడం అనేది పాన్ ఇండియా మార్కెట్ పరంగా ప్రతికూల అంశమనే చెప్పాలి. అందుకే సుకుమార్ అండ్ టీమ్ ఇప్పుడు డెడ్ లైన్ ని అందుకోలేకపోతే.. విడుదల తేదీని సర్దుబాటు చేసుకునే ఆలోచన చేస్తోందట. ఒక వారం లేటుగా అంటే డిసెంబర్ 24న రావాలని చూస్తున్నారట.

అదే తేదీకి నాని 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాకపోతే ఇప్పుడు 'పుష్ప' ఆ తేదీకి రావాలని అనుకుంటే.. నాని సినిమాని వారం ముందుకు జరపాలని ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. సినిమా ఇప్పటికే రెడీగా ఉండటం.. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేయడంతో శ్యామ్ సింగ చిత్రానికి ఇబ్బంది ఉండకపోవచ్చని ఆలోచిస్తున్నారట. కాకపోతే జనవరి 7న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విడుదల ఉందనే పండక్కి వారం ముందుగా డిసెంబర్ 17వ తేదీని 'పుష్ప' కోసం లాక్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ కు రిలీజ్ చేస్తే రెండో వారం నుంచి వసూళ్ల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఏదైనా సుకుమార్ బృందం అనుకున్న సమయానికి 'పుష్ప' సినిమా పనులు పూర్తి చేసే దాన్ని బట్టే విడుదల ఉంటుందని చెప్పవచ్చు.
Tags:    

Similar News