పవన్‌ మాటలు నాకు చెప్పి అలీ బాధపడ్డాడు

Update: 2019-04-17 08:17 GMT
ఎన్నికల సమయంలో అలీని ఉద్దేశించి పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. స్నేహితుడు అని నమ్మి చాలా సాయం చేశాను, అతడు కోరిన వ్యక్తికి సీటు కూడా ఇచ్చాను. కాని నన్ను మోసం చేశాడు అంటూ అలీపై పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆ వ్యాఖ్యలకు అలీ కూడా గట్టి కౌంటర్‌ ఇవ్వడం జరిగింది. పవన్‌ నాకేం సాయం చేయలేదు, ఆయన కంటే ముందే ఇండస్ట్రీకి వచ్చాను, సొంతంగా కష్టపడి సినిమా అవకాశాలు దక్కించుకుని ఈ స్థాయికి వచ్చానంటూ అలీ అన్నాడు. వీరిద్దరి మద్య వివాదంపై సినీ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. తాజాగా ఈ విషయమై కమెడియన్‌ పృథ్వీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పృథ్వీ ఒక ఇంటర్వ్యూలో... పవన్‌ కళ్యాణ్‌ గారు తన సినిమాలో అలీకి మాత్రమే ఛాన్స్‌ ఇస్తారా, మాలాంటి వారికి ఛాన్స్‌ ఇవ్వరా అనుకునేవాళ్లం. షూటింగ్‌ సమయంలో పవన్‌ కళ్యాణ్‌, అలీ చాలా సేపు మాట్లాడుకునే వాళ్లు. మేము మాత్రం ఆయన ఎదురు అయితే వంగి నీ బాంచన్‌ అన్నట్లుగా నమస్కారం పెట్టి, దూరంగా కూర్చునేవాళ్లం. ఎప్పుడైనా పిలిస్తే వెళ్లి మాట్లాడేవాళ్లం అంటూ అలీ పవన్‌ ల అనుబంధం గురించి పృథ్వీ చెప్పుకొచ్చాడు.

నేను, అలీ ఇంకొందరం చెన్నైలో కష్టాలు పడి ఎదిగిన వాళ్లం. అలీ చాలా సహాయాలు చేస్తాడు. కాని వాటిని చెప్పుకునేందుకు ఆసక్తి చూపించడు. అలీ తన తండ్రి పేరుమీద ట్రస్ట్‌ పెట్టి మరీ ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. నాతో అలీ చాలా సన్నిహితంగా ఉంటాడు. అందుకే పవన్‌ ఆ మాటలు మాట్లాడగానే అలీ నాకు ఫోన్‌ చేశాడు. అన్నా ఏంటీ ఇది, ఆయన నా గురించి ఇలా మాట్లాడుతాడని నేను అనుకోలేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఆయన నన్ను అడిగి ఎవరికి సీట్లు ఇవ్వలేదు. పార్టీ పెట్టినప్పుడు కాని, ఈమద్య కాని ఎప్పుడు కూడా జనసేనలో జయిన్‌ అవ్వమని అడగలేదు. ఇప్పుడు మాత్రం నేను నమ్మక ద్రోహం చేశానని అంటున్నాడేంటి అంటూ నాతో చెబుతూ అలీ చాలా బాధ పడ్డాడు.

అలీ కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తి, కష్టపడి పైకి వచ్చాడు. ఆయన కంటే ముందే అలీ ఇండస్ట్రీకి వచ్చి గుర్తింపు దక్కించుకున్నాడు. అలాంటి అలీ గురించి ఆయన అలా మాట్లాడటం భావ్యం కాదనిపించిందని పృథ్వీ అన్నాడు.


Tags:    

Similar News