అల్లు అరవింద్ గారు నా గాడ్ ఫాదర్ - అఖిల్

Update: 2021-10-15 03:57 GMT
అక్కినేని వారసుడిగా కొంతకాలం క్రితం అఖిల్ భారీ అంచనాల మధ్య తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే ఆ సినిమాలు ఏవీ కూడా ఆయన ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. దాంతో అఖిల్ తో పాటు ఆయన అభిమానులంతా తీవ్రమైన నిరాశకు లోనయ్యారు. కథాకథనాల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఖర్చు విషయంలో వెనుకాడనప్పటికీ సక్సెస్ అనేది ఆయనకి కనుచూపు మేరలోనే ఉండిపోయింది. మంచి కథ కోసం వెయిట్ చేస్తుంటే, అభిమానులతో తనకి గల గ్యాప్ పెరిగిపోతుందేగానీ, ఫలితం మాత్రం ఉండటం లేదు.

ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని ఒక అయోమయానికి అఖిల్ లోనయ్యాడు. తనని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారు? తన నుంచి వాళ్లు ఏం ఆశిస్తున్నారు? అనే విషయం అఖిల్ కి అర్థం కాలేదు. దాంతో ఆయన కథల విషయంలో మరింతగా కసరత్తు చేయడం మొదలుపెట్టాడు. ఇక అలాంటి పరిస్థితుల్లో అఖిల్ ను అల్లు అరవింద్ కి అప్పగించడమే మంచిదనే ఆలోచనతో నాగార్జున అదే పని చేశారు. అల్లు అరవింద్ కి కథల ఎంపిక విషయంలో అపారమైన అనుభవం ఉంది. చిరంజీవి అందుకున్న ఘన విజయాలలో ఆయన పాత్ర కీలకం. దానికి తోడు ఆయన ఈ జనరేషన్ ఆలోచనలను అందుకోవడానికి గాను బన్నీ వాసును తీసుకున్నారు.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై వారు అఖిల్ తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా చేశారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ప్రేమలో ఉన్నప్పుడు మనసు ఏది ఆశపడుతుంది? పెళ్లి తరువాత మనసు ఏం ఆశిస్తుంది? అనే ఇంట్రెస్టింగ్ లైన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అలాంటి ఒక కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా, కరోనా కారణంగా విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూ వచ్చింది. చివరికి 'విజయదశమి' కానుకగా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.

ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ .. 'బొమ్మరిల్లు' భాస్కర్ కథ వినిపించగానే నాకు నచ్చేసింది. దర్శకుడిగా ఆయనకి కొంత గ్యాప్ వచ్చి ఉండొచ్చు. అంతమాత్రాన ఆయన టాలెంట్ తగ్గిందని చెప్పలేం. నేను కథను నమ్మాను .. ఆ తరువాత అల్లు అరవింద్ గారిని నమ్మాను. ఎందుకంటే కథ విషయంలో నా జెడ్జిమెంట్ తప్పినా ఆయన జడ్జిమెంట్ తప్పే అవకాశమే లేదు. ఇక బన్నీ వాసు ఒక కథను అంచనా వేయడంలో సిద్ధహస్తుడు. కథలో ఎక్కడ ఏది తక్కువ పడితే అక్కడ అది వేయడం ఆయనకి బాగా తెలుసు. అందువలన ఈ ప్రాజెక్టు విషయంలో నేను మరింత కాన్ఫిడెంట్ గా ఉన్నాను.
4

ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి అల్లు అరవింద్ గారు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ గా చూసుకున్నారు. ఆయన చూపించిన ప్రేమానురాగాలను మరిచిపోలేను. నాకు తప్పకుండా హిట్ ఇవ్వాలనే ఒక తపనతో బన్నీ వాసుతో కలిసి ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నా ఫోన్ లో ఆయన నెంబర్ ను 'గాడ్ ఫాదర్' పేరుతోనే ఫీడ్ చేసుకున్నాను. ఒక సినిమా విషయంలో వాళ్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో తెలిశాక, ఈ బ్యానర్లో నాకు మరో సినిమా చేయాలనిపిస్తోంది. చేస్తాననే నమ్మకం కూడా ఉంది"అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా హిట్ కొట్టడం అఖిల్ తో పాటు 'బొమ్మరిల్లు' భాస్కర్ కి కూడా అంతే అవసరమని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనేలేదు.


Tags:    

Similar News