నేను వద్దంటే వద్దన్నాను : అఖిల్‌

Update: 2019-01-24 15:44 GMT
రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'మిస్టర్‌ మజ్ను' చిత్రంపై అఖిల్‌ తో పాటు అక్కినేని అభిమానులు అంతా కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. మొదటి రెండు సినిమాలతో నిరాశ పర్చిన అఖిల్‌ ఎట్టకేలకు ఈ చిత్రంతో అభిమానులను మరియు ప్రేక్షకులను అలరిస్తాడనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌ లో భాగంగా నాగార్జున మరియు అఖిల్‌ లు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆ ఇంటర్వ్యూలో అఖిల్‌ ను నాగార్జున పలు ప్రశ్నలు వేశాడు. ఈ చిత్రంలో నువ్వు పంచె కట్టులో కనిపించబోతున్నావు, ఆ పోస్టర్‌ నేను చూశాను. పెంచె కట్టు అంటే మామూలు విషయం కాదు - నాకు తెలిసి నాన్నగారికి తప్ప ఇండస్ట్రీలో ఎవరికి పంచె కట్టు అంతగా సెట్‌ అవ్వలేదు. కాని నువ్వు మాత్రం మూడవ సినిమాకే ఇంత పెద్ద సాహసం చేశావు అంటూ ప్రశ్నించాడు. అందుకు అఖిల్‌ సరదాగా సమాధానం ఇచ్చాడు. నేను ఒక సీన్‌ లో పంచ కట్టుకోవాలని వెంకీ అన్నాడు. పంచ అనగానే నేను వద్దంటే వద్దన్నాను. పంచ కట్టడమే కష్టం - దాంతో నటించడం అంటే నా వల్ల కాదని చెప్పాను - కాని నన్ను వెంకీ ఒప్పించాడు.

వెంకీ చెప్పిన మాయ మాటలతో నేను పంచ కట్టుకు ఒప్పుకున్నాను. పంచ కట్టుకుని సీన్‌ చేసిన తర్వాత నాకు కూడా బాగా నచ్చింది. తాత గారు గతంలో పంచ కట్టులో ఉన్న వీడియోలను చూసి - సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో మీరు కట్టుకున్న పంచ కట్టును చూసి నేను ఈసాహసం చేశానంటూ అఖిల్‌ చెప్పుకొచ్చాడు.

షూటింగ్‌ సమయంలో కుక్కలపై - అమ్మపై తెగ కోప్పడేవాడివి కదా ఎందుకు అంటూ నాగార్జున ప్రశ్నించిన సమయంలో అఖిల్‌ స్పందిస్తూ.. ఈ చిత్రం కోసం 8 ప్యాక్‌ బాడీ ట్రై చేశాను. అందుకోసం ఎక్కువగా ఆహారం తీసుకోకుండా ఉండాలి. అలా ఉండటం వల్ల విపరీతమైన ఆకలిగా ఉండేది. ఆకలిగా ఉన్న సమయంలో నాకు బాగా కోపంగా ఉండేది. అందుకే కుక్కలపై - అమ్మపై ఆ కోపంను చూపించేవాడినంటూ అఖిల్‌ చెప్పుకొచ్చాడు. తాను పడ్డ కష్టంకు ఈ చిత్రం ప్రతిఫలంగా నిలుస్తుందనే నమ్మకంను అఖిల్‌ వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News