అరవిందకు అజ్ఞాతవాసి దెబ్బ!?

Update: 2018-09-02 14:30 GMT
సినిమా పరిశ్రమలో ట్రాక్ రికార్డు చాలా ముఖ్యం. దాన్ని బట్టే వ్యాపారమైనా అవకాశాలైనా ఆధారపడి ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మొదటిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న అరవింద సమేత వీర రాఘవ మీద అంచనాలు ఇప్పటికే  పీక్స్ లో ఉన్నాయి. హరికృష్ణ అకాల మరణంతో కొంత విరామం తప్పదేమో అనుకున్నారు కానీ తండ్రి లేని లోటు గుండెను కొస్తున్నా తారక్ మాత్రం షూటింగ్ కి రెడీ అయిపోయాడు. ఇదిలా ఉంచితే అరవింద సమేత వీర రాఘవకు అజ్ఞాతవాసి ఎఫెక్ట్ బాగా పడుతోందని ఇన్ సైడ్ టాక్. సుమారు 125 కోట్ల దాకా బిజినెస్ జరిగిన పవన్ సినిమా అప్పుడు సగం మాత్రమే వెనక్కు తెచ్చి భారీ నష్టాలు మిగిల్చింది. తర్వాత ఆ బ్యానర్ లో  తీసే సినిమాల్లో అడ్జస్ట్ మెంట్ చేసుకోవచ్చనే రీతిలో మాట్లాడుకున్నారు కానీ ఇప్పుడు అదే చిక్కులు తెచ్చి పెడుతోందని సమాచారం. శైలజారెడ్డి అల్లుడుని మంచి రేట్లకు ఇవ్వడం ద్వారా మేనేజ్ చేయొచ్చనుకుంటే అది అంతగా సఫలం కాలేదని టాక్.

అరవింద సమేత వీర రాఘవకు అజ్ఞాతవాసికి లింక్ పెట్టి డిస్ట్రిబ్యూటర్లు పేచీ పడుతుండటం నిర్మాత చినబాబుని ఇబ్బంది పెడుతోందట. అదే బ్యానర్ కావడంతో ఎటు తేల్చలేక చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. కొనుగోలుదారులు మాత్రం పట్టు బడుతున్నట్టుగా తెలిసింది. టీజర్ వచ్చాక అంచనాలు ఇంకా పైకి వెళ్తాయి అనుకుంటే ఇదో రెగ్యులర్ మాస్ సినిమా అనే ఫీలింగ్ కలిగించడం కూడా కొంత ప్రభావం చూపిస్తోందని మరో టాక్ ఉంది. అజ్ఞాతవాసి సెటిల్ మెంట్స్ ఏడు నెలలు దాటినా ఇంకా పూర్తి  కాకపోవడం విచిత్రమే. శైలజారెడ్డి అల్లుడు  బిజినెస్ పవన్ తారక్ రేంజ్ లో సాగే అవకాశం లేదు కాబట్టి బాలన్స్ మొత్తాన్ని అరవింద సమేతతో సర్దాలని ప్రయత్నిస్తున్న బయ్యర్స్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. దీనికి సంబంధించిన టాక్ ఫిలిం నగర్ లో జోరుగా సాగుతోంది.
Tags:    

Similar News