ఉరీ బాధితులకు కలెక్షన్లలో కొంత ఇస్తారట

Update: 2016-10-21 17:07 GMT
ఉరీ ఉగ్రఘటన.. ఆ తర్వాత జరిగిన సర్జికల్ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ నటీనటులు నటించిన చిత్రాలకు ఎదురైన కష్టాల ముచ్చట తెలిసిందే. మొదట్లో కలలు.. దేశాల సరిహద్దులు లాంటి కబుర్లు చెప్పినప్పటికీ.. దేశ ప్రజల నుంచి ఎదురైన వ్యతిరేకత.. కొన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన హెచ్చరికలతో నోటికి వచ్చినట్లు మాట్లాడిన వారంతా.. కాస్త సెట్ అయిన పరిస్థితి. కళ కోసం.. తాము నమ్మిన సిద్దాంతం కోసం కాసులు వదులుకోవటానికి ఏ మాత్రం సిద్ధం లేదన్న విషయాన్ని తేల్చేయటమే కాదు.. తమకంత పెద్ద మనసు లేదన్న విషయాన్ని కరణ్ జోహార్ లాంటోళ్లు కన్ఫర్మ్ చేశారు.

తన తాజా సినిమా.. యే దిల్ హై ముష్కిల్ రిలీజ్ కావటం సందేహంగా మారిన నేపథ్యంలో.. కరణ్ తన బింకపు మాటల్ని పక్కన పెట్టేసి.. పాక్ నటీనటులతో భవిష్యత్తులో అస్సలు సినిమాలే తీయనని మాటిచ్చేశాడు. పాక్ కళాకారులు నటించిన సినిమాలపై పలువురు తీవ్రంగా వ్యతిరేకించటం.. భారత సినీ ఓనర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సైతం అదే తీరులో ఉండటంతో విడుదల అంశంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే దీపావళికి విడుదల కానున్న యే దిల్ హై ముష్కిల్.. శివాయ్ చిత్రాల ఎగ్జిబిటర్లకు.. డిస్ట్రిబ్యూటర్స్ కు భారత సినీ ఓనర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఒక లేఖ రాశారు.

దీపావళికి విడుదలయ్యే చిత్రాల మొదటి షోకు వచ్చే కలెక్షన్లలో కొంత భాగాన్ని ఉరీ ఉగ్రఘటనలో బాధితులుగా మారిన కుటుంబాలకు సాయంగా ఇవ్వాలన్న ప్రతిపాదన చేశారు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూసిన వారంతా.. ఈ ప్రతిపాదనకు సముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. చూస్తుంటే.. రిలీజ్ కష్టాలకు.. కలెక్షన్లలో వాటాతో చెక్ చెప్పాలన్నట్లుగా కనిపించట్లేదు..?
Tags:    

Similar News