శివరాత్రి సందర్భంగా ''శివుడు'' గా వచ్చిన ఆది పినిశెట్టి..!

Update: 2021-03-11 13:30 GMT
ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి.. తెలుగులో 'నిన్నుకోరి' 'మలుపు' 'నీవెవరో' 'యూ టర్న్' 'రంగస్థలం' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ''శివుడు'' అనే గ్రామీణ నేపథ్యంలో రూపొందే యాక్షన్ ఎంటర్టైనర్ తో పలకరించబోతున్నాడు. 'పల్నాడు' 'నా పేరు సూర్య' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ సుశీంద్రన్ ఈ స్ట్రెయిట్ తెలుగు సినిమాతో వస్తున్నాడు. నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ''శివుడు'' టైటిల్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

శివరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి 'శివుడు' అనే టైటిల్ ని ఖరారు చేయడం గమనార్హం. ఈ పోస్టర్ లో తల ముక్కుకు గాయాలతో ఆది పినిశెట్టి ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. టైటిల్ లోగోని కూడా రక్తంతో డిజైన్ చేయడం చూడవచ్చు. 'శివుడు' టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో పాటు ఆది బలమైన కంటెంట్‌ తో మరోసారి వస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి సమర్పణలో ఆదర్శ చిత్రాలయ బ్యానర్ పై ఆది సోదరుడు సత్య ప్రభాస్ నిర్మిస్తున్నారు.

ఇకపోతే ఇందులో ఆది పినిశెట్టి సరసన నిక్కీ గల్రానీ - ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సునీల్ - హరీష్ ఉత్తమన్ - కేరాఫ్ కంచరపాలెం రాజు - జెపి - శత్రు - ప్రిన్స్ - శరత్ లోహితస్వా - ముక్తార్ ఖాన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఏస్ సినిమాటోగ్రాఫర్ వేల్‌ రాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జై సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్ సాహిత్యం రాస్తున్నారు. కాశీ విశ్వనాథన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ''శివుడు'' చిత్రాన్ని త్వరలోనే గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
Tags:    

Similar News