నేను చేస్తున్నా... ఆ వార్త‌లు నిజం కాదు: హ‌న్సిక‌

Update: 2022-04-03 09:33 GMT
హన్సిక మోత్వాని.. ఈ సొట్టబుగ్గల సుందరి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముంబైలో జ‌న్మించిన ఈ అందాల భామ.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప‌లు సినిమాలు, సీరియ‌ల్స్ చేసింది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన‌ `దేశముదురు` సినిమాలో అల్లు అర్జున్ సర‌స‌న న‌టించి.. తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. హీరోయిన్‌గా ఇదే ఆమెకు తొలి సినిమా. 2007లో విడుద‌లైన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డ‌మే కాదు.. హ‌న్సిక‌కు మ‌రిన్ని ఆఫ‌ర్లు వ‌చ్చేలా కూడా చేసింది.

ఆ త‌ర్వాత తెలుగుతో పాటు త‌మిళంలోనూ వ‌రుస సినిమాలు చేసి స్టార్ హోదాను ద‌క్కించుకున్న హ‌న్సిక‌.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. `నాకు విభిన్నమైన స్క్రిప్ట్‌లు అంతే ఎంతో ఇష్టం. నటనలో మరింత వైవిధ్యం ఉండేలా నన్ను నేను తీర్చిదిద్దుకుంటున్నా. ఒక‌వేళ నా అందానికి తగ్గట్టు గ్లామర్‌ పాత్రలు వస్తే చెయ్యడానికి ఏ మాత్రం వెనుకాడను.` అంటూ  చెప్పుకొచ్చింది.

అలాగే తాను చేస్తున్న ప్రాజెక్ట్‌ల‌ గురించి స్పందిస్తూ.. `నా 50వ సినిమా ``మ‌హా`` త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇటీవ‌లె  నా 55వ మూవీ షూటింగ్ సైతం స్టార్ట్ అయింది. అలాగే ఓటీటీలు వచ్చాక లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల హవా బాగా పెరిగింది. నేనూ ఓటీటీ వేదికగా ఓ సిరీస్‌ చేస్తున్నా. విభిన్న‌మైన క‌థ‌తో ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు` అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ఇటీవ‌ల హ‌న్సీక దర్శకత్వం వైపు అడుగులు వేస్తుందంటూ వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది.ఒక సినిమాకు దర్శకత్వం వహించడం అనేది పెద్ద టాస్క్‌. నేను దర్శకత్వం వైపు వెళ్తున్నాననే వార్త‌ల్లో నిజం లేద‌ని పేర్కొంది. కాగా, హ‌న్సిక తెలుగులో ప్ర‌స్తుతం `మై నేమ్ ఈజ్ శృతి`, `105 మినిట్స్` చిత్రాలు చేస్తుంది. వీటితో పాటు త‌మిళంలోనూ ప‌లు ప్రాజెక్ట్స్‌కు సైన్ చేసింది.
Tags:    

Similar News