చిరు గ్రేస్ ఫుల్ స్టెప్పులకు రెజీనా అందాలు తోడైతే.. 'సానా కష్టం'

Update: 2022-01-03 11:10 GMT
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. ఈ సినిమా నుంచి విడుద‌లైన స్పెషల్ పోస్టర్స్ - టీజర్ - 'లాహె లాహె' 'నీలాంబ‌రీ' పాటలు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించాయి. ఈ క్రమంలో తాజాగా 'సానా కష్టం' అనే మూడో పాట లిరికల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేసారు.

న్యూ ఇయర్ కానుకగా వచ్చిన 'సానా కష్టం' ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండగా.. లేటెస్టుగా వచ్చిన ఫుల్ సాంగ్ మాస్ ఆడియన్స్ తో స్టెప్పులు వేయిస్తోంది. 'కల్లోలం కల్లోలం ఊరూ వాడా కల్లోలం నేనొస్తే అల్లకల్లోలం.. కల్లోలం కల్లోలం కిందా మీదా కల్లోలం నా అందం అల్లకల్లోలం..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. 'సానా కష్టం వ‌చ్చిందే మందాకినీ... చూసేవాళ్ల క‌ళ్లు కాకులు ఎత్తుకుపోనీ..' అంటూ చిరు వేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది.

మెగా బాస్ డ్యాన్స్ లో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని 'సానా కష్టం' సాంగ్ నిరూపిస్తోంది. థియేటర్స్ లో విజిల్స్ గ్యారంటీ అని సూచిస్తోంది. ఇందులో చిరంజీవితో కలిసి రెజీనా కాసాండ్రా ఆడిపాడింది. చిరుకు పోటీగా చిందులు వేస్తూ మెప్పించింది రెజీనా. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన ఈ డ్యాన్స్ నంబర్ ను సింగర్స్ రేవంత్‌ - గీతామాధురి హుషారుగా ఆలపించారు.

నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరించబడిన ఈ పార్టీ సాంగ్ విజువల్ గా కూడా ఆకట్టుకుంది. దీనికి తిరునవుక్కరసు సినిమాటోగ్రఫీ అందించగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఏదేమైనా మణిశర్మ వింటేజ్ మ్యూజిక్ కు మెగాస్టార్ గ్రేస్ ఫుల్ స్టెప్పులు తోడై ఈ పాట ఇన్స్టెంట్ గా ప్రేక్షకులకు ఎక్కేసింది.. మెగా అభిమానుల్లో జోష్ నింపింది.

కాగా, 'ఆచార్య' చిత్రంలో చిరంజీవితో పాటుగా రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చిరుకు జోడీగా కాజల్‌ అగర్వాల్ - చరణ్‌ కు జంటగా పూజాహెగ్డే స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. దేవాదాయ శాఖలోని అవినీతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ‘ధర్మస్థలి’ పేరుతో భారీ సెట్‌ ఏర్పాటు చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఆచార్య' చిత్రాన్ని 2022 ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.


Full View
Tags:    

Similar News