బన్నీ ఏ టైటిల్ తో రాబోతున్నాడు?

Update: 2020-04-07 07:21 GMT
బన్నీ - సుకుమార్ కాంబోలో అల్లు అర్జున్ కెరీర్లో 20వ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తన బర్త్ డే అయిన ఏప్రిల్ 8వ తేదిన తన 20వ సినిమాకు సంబంధించిన ఒక ప్రకటన చేయనున్నాడు. ఈ సందర్భంగా నిర్మాతలు మైత్రీ మూవీస్ వాళ్లు ట్విట్టర్‌లో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా.. ''ఏమబ్బా అందరు బాగుండారా.. మీరు ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తాండే.. #AA20 అప్డేట్ ఏప్రిల్ 8 తెల్లార్తే 9 గంటలకు వస్తాండాది.. రెడీ కాండబ్బా''.. అంటూ వదిలారు. ఈ ఏడాది ప్రారంభంలో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడింది. 'రంగస్థలం' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమాను సుకుమార్ శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తుండగా విజయ సేతుపతి కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘శేషాచలం’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదని.. ఇప్పటికే వేరే టైటిల్‌‌ ను ఫిల్మ్ ఛాంబర్‌ లో రిజిస్టర్ చేయించారని సమాచారం. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. వాస్తవానికి ఈ చిత్రం కోసం మూడు టైటిళ్లను అనుకుంటున్నారట. వాటిలో ఇప్పుడు తాజాగా 'పుష్ప' అనే టైటిల్ ఒకటి.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర పేరు 'పుష్పక నారాయణ' అని సమాచారం. అందులోనూ బన్నీ ఈ సినిమాలో లారీ డ్రైవరు గా కనిపిస్తాడని తెలుస్తోంది. తన లారీ అంటే అమితంగా ఇష్టపడతాడంట. అందువల్ల తన పేరు - లారీ పేరు రెండు కలిసొచ్చేలా 'పుష్ప' అనే పేరు పెట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రం కోసం 'కుమారి' - 'గంగ' అనే మరో రెండు టైటిళ్లను కూడా లైన్ లో పెట్టారంట. రేపు బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూడు టైటిల్లలో ఏదో ఒకటి ప్రకటించే అవకాశం ఉంది. నిన్న విడుదలైన పోస్టర్ ద్వారా రాయలసీమ యాస తో సినిమా లో బన్నీ పాత్ర ఉంటుందని ఇప్పటి దాకా వచ్చిన వార్తల్ని నిజమే అని చెప్పొచ్చు. మరి ఈ టైటిల్ విషయంలో వచ్చిన వార్త కూడా నిజమవుతుందేమో చూడాలి.
Tags:    

Similar News