గూగుల్ మెచ్చుకున్న ఈ నటుడి గురించి తెలుసా?

Update: 2021-10-01 13:30 GMT
రజనీకాంత్ సినిమా ‘నరసింహా’లో తండ్రి పాత్ర పోషించిన నటుడు గుర్తున్నారా..? ఇందులో ఆయన కీలక పాత్రలో నటించి మెప్పించారు. దురదృష్టవశాత్తూ ఇదే ఆయన చివరి సినిమా. అయితే ఆయన గురించి నేటితరం సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆ కాలంలోనే అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సాధించిన మొదటి భారతీయ నటుడు. ఎన్నో అవార్డులు, మరెన్నో సత్కారాలు పొందిన ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ జయంతి సందర్భంగా గూగుల్ గౌరవించింది. తన డూడుల్ లో ప్రత్యేకంగా పెట్టింది. దీంతో శివాజీ గణేశన్ గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. దశాబ్దాల కిందటే గ్లోబల్ నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన గురించి మరోసారి గుర్తు చేసుకుందాం..

శివాజీ గణేశన్ అసలు పేరు గణేషమూర్తి. తమిళనాడులోని విల్లాపురంలో 1928 అక్టోబర్ 1 జన్మించాడు. పదేళ్ల వయసులోనే నాటకాలపై ఇంట్రెస్టుతో ఆ రంగంలో అడుగుపెట్టారు. మొదటిసారిగా 1945లో హిందూ రాజ్యం అనే నాటకంలో శివాజీ పాత్రను పోషించాడు గణేషమూర్తి. ఈయన నటనను చూసిన ప్రముఖ సంఘసంస్కర్త ఈవీ రామస్వామి గణేష మూర్తిని శివాజీగా అభివర్ణించాడు. దీంతో ఆయన పేరు శివాజీ గణేషన్ గా మారిపోయింది. ఆ తరువాత శివాజీ గణేశన్ సినీ రంగంలో అడుగుపెట్టాడు.

1952లో ప్రజాశక్తి అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించిన ఆయన అంతర్జాతీయ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతర్జాతీయంగా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తొలి నటుడిగా శివాజీ గణేశన్ పేరు చెబుతుంటారు. ఈజిప్టులోని కైరోలో 1960లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివెల్లో శివాజీ గణేషన్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును ఆదేశ అధ్యక్షుడు గమల్ అబ్దెల్ నాసర్ అందించాడు. ఇక అమెరికాలోనూ శివాజీ గణేశన్ కు అనేక సత్కారాలు లభించాయి. 1962లో కల్చరల్ ఈవెంట్ కోసం ఆయన అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ, శివాజీని కల్చరల్ అంబాసిడర్ గా గుర్తించారు. ఆ తరువాత ఆయన పలు దేశాల్లో పర్యటించారు. ది లాస్ ఏంజిల్స్ టైమ్స్ శివాజీ గణేషన్ ను ‘మార్లోస్ బ్రాండ్ ఆఫ్ సౌత్ ఇండియాన్’ గా అభివర్ణించింది.

పుదియా పరవై, దైవ ముగన్ లాంటి ఎన్నో సినిమాలు శివాజీ గణేషన్ కు పేరు తెచ్చిపెట్టాయి. అలాగే మనోహర, పరదేశి, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, రామదాసు, బంగారు బాబు, నివరు గప్పిన నిప్పు, అగ్ని పుత్రుడు లాంటి తెలుగు సినిమాల్లో నటించారు. ఆయన చివరిగా రజనీకాంత్ నటించిన నరసింహాలో నటించారు. ఇక ఆత్మ బంధువు (డబ్బింగ్) సినిమాలోని పాటలు ఇప్పటికీ అలరిస్తూ ఉంటాయి. క్షత్రియ పుత్రుడు సినిమాలో తేవర్ ముగన్ అనే పాత్రకు శివాజీ గణేశన్ కు జాతీయ అవార్డు లభించింది. అయితే దానిని ఆయన తిరస్కరించారు. 1995లో ప్రాన్స్ గౌరవం పొందారు. ఇక 1997లో ప్రముక దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకున్నారు. అలాగే కలైమామణి, పద్మశ్రీ, పద్మ భూషన్, చెవలియర్, ఎన్టీఆర్ నేషనల్ అవార్డులు అందుకున్నారు.

రజనీకాంత్, కమలాసన్ లాంటి ప్రముఖ హీరోలపై శివాజీ గణేశన్ ముద్ర పడింది. పాన్ ఇండియా, విదేశీ అభిమానం పొందుతున్న నేటి హీరోల మాదిరిగానే శివాజీ గణేశన్ దశాబ్దాల కిందటే అంతర్జాతీయ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయన కుమారుడు సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు ప్రభు. ఇక ఆయన మనువడు విక్రమ్ కూడా (తెలుగులో గజరాజు) ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. శ్వాస కోస సంబంధిత వ్యాధులతో జూలై 21న శివాజీ గణేషన్ కన్నుమూశారు. అయితే అక్టోబర్ 1న ఆయన జయంతి సందర్భంగా గూగుల్లో ప్రత్యేకంగా డూడుల్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకోవడానికి చాలా మంది సెర్చ్ చేస్తున్నారు.




Tags:    

Similar News