40 ఏళ్ల తర్వాత..10 ఏళ్ల కసరత్తుకు ఎట్టకేలకు తెర!
హాలీవుడ్ యాక్షన్ చిత్రాల చరిత్రలో సరికొత్త ఒరవడిని సృష్టించిన `కోనన్ ది బార్బేరియన్` చిత్రం విడుదలై దాదాపు నాలుగు దశాబ్దాలు గడిచినా? ఆ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
హాలీవుడ్ యాక్షన్ చిత్రాల చరిత్రలో సరికొత్త ఒరవడిని సృష్టించిన `కోనన్ ది బార్బేరియన్` చిత్రం విడుదలై దాదాపు నాలుగు దశాబ్దాలు గడిచినా? ఆ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో యాక్షన్ లెజెండ్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్‌కు అంతర్జాతీయంగా భారీ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ఇప్పుడు ఎట్టకేలకు సీక్వెల్ సిద్ధమవుతోంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను ఆర్నాల్డ్ స్వయంగా ధృవీకరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాలీవుడ్ సినీ ప్రియుల్లో ఉత్సాహం నెలకొంది.
తాజా సీక్వెల్‌కు `కింగ్ కోనన్` అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. గత చిత్రంలో యువ యోధుడిగా శత్రువులను చీల్చిచెండాడిన కోనన్ పాత్ర కొత్త చిత్రంలో ఓ అనుభవజ్ఞుడైన, వృద్ధ రాజుగా కనిపించబోతోంది. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ప్రస్తుత వయస్సుకు , శారీరక ఆకృతికి సరిగ్గా సరిపోయే విధంగా పాత్రను ఎంతో పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కోణంలో ఆర్నాల్డ్ యాక్షన్ డ్రామాలో తలపడటం విశేషం. ఈ భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక చిత్రానికి హాలీవుడ్ అగ్ర దర్శకుడు `మిషన్ ఇంపాజిబుల్` ఫ్రాంచైజీ చిత్రాల సృష్టికర్త క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహించనున్నారు.
క్రిస్టోఫర్ మెక్‌క్వారీకి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలను అత్యున్నత సాంకేతిక విలువలతో ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో దిట్ట. ఆయన ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అవ్వడంతో `కింగ్ కోనన్` స్థాయి మరింత పెరిగిందని చెప్పొచ్చు. పాత తరం యాక్షన్‌ను ఆధునిక హాలీవుడ్ మేకింగ్ శైలితో మిళితం చేసి అద్భుతమైన విజువల్ వండర్‌గా తీర్చిదిద్దనున్నారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి ఈ సీక్వెల్ ఆలోచన చాలా పదేళ్ల క్రితమే వచ్చినా? సరైన కథ , ప్రొడక్షన్ భాగస్వామ్యం కుదరకపోవడం వల్ల ఇన్నాళ్లూ ఆలస్యమవుతూ వచ్చింది.
అయితే అప్పటి నుంచి కథపై మాత్రం నిరంతరం చర్చలు జరుగుతున్నాయి. తాజాగా కథా చర్చలు విజయ వంతంగా ముగిసాయి. బలమైన స్క్రిప్ట్ సిద్ధమవడంతోనే ఆర్నాల్డ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. దశాబ్దాలుగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ కలగకుండా ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆకట్టుకునేలా రాసుకున్నామని క్రిస్టోఫర్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం హాలీవుడ్‌లో పాత క్లాసిక్ చిత్రాలను, దశాబ్దాల తర్వాత సరికొత్త సాంకేతికతతో సీక్వెల్స్ .. రీబూట్స్ రూపంలో తీసుకురావడం విజయవంతమైన ట్రెండ్‌గా నడుస్తోంది. `టాప్ గన్: మావెరిక్` వంటి చిత్రాలు సాధించిన భారీ విజయాలు ఈ తరహా ప్రయత్నాలకు మరింత ఊతాన్ని ఇస్తున్నాయి. అదే బాటలో వస్తున్న `కింగ్ కోనన్` కూడా పాత తరం ప్రేక్షకులలో ఉన్న నోస్టాల్జియాను మేల్కొల్పడమే కాకుండా నేటి తరం యువ ప్రేక్షకులను సైతం అద్భుతమైన ఫాంటసీ యాక్షన్ ప్రపంచంలోకి తీసుకెళ్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వయస్సుతో పని లేకుండా ఇప్పటికీ తనలో ఉన్న నటుడిని, యాక్షన్ స్టార్‌ను ప్రపంచానికి చాటిచెప్పడానికి ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ వృద్ధ రాజు పాత్రను సవాలుగా తీసుకున్నారు.
ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తుంది. భారీ తారాగణం , అత్యున్నత సాంకేతిక నిపుణులు ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం హాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ బార్బేరియన్ శకం ఆధునిక కాలంలో క్రిస్టోఫర్ మెక్‌క్వారీ మేధస్సుకు తోడై ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాలని ప్రపంచవ్యాప్త సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.