రామాయణం (X) వాల్మీకి రామాయణం: రెహమాన్ - ఇళయరాజా మధ్య ఆసక్తికర పోరు!

భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఇతివృత్తంతో రూపొందుతున్న రెండు భారీ చిత్రాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.;

Update: 2026-04-20 04:04 GMT

భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఇతివృత్తంతో రూపొందుతున్న రెండు భారీ చిత్రాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న `రామాయణం` ఒకవైపు.. భావనా తల్వార్ దర్శకత్వంలో తాజాగా ప్రకటించిన `వాల్మీకి రామాయణం` మరోవైపు ప్రేక్షకులలో ఉత్కంఠను రేపుతున్నాయి. అయితే ఈ రెండు ప్రాజెక్టుల మధ్య అసలైన పోటీ నటీనటుల కంటే కూడా.. వాటికి సంగీతం అందిస్తున్న ఇద్దరు దిగ్గజాల మధ్యే ఉండబోతుండటం విశేషం.

ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ నమిత్ మల్హోత్రా `రామాయణం` చిత్రానికి బాణీలు కడుతుండగా.. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా `వాల్మీకి రామాయణం` బాధ్యతలను భుజాన వేసుకున్నారు. భారతీయ సంగీత ప్రపంచాన్ని దశాబ్దాలుగా ఏలుతున్న ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే గాథకు భిన్నమైన వెర్షన్లలో సంగీతం అందించడం ఒక గొప్ప `మ్యూజికల్ ఫీస్ట్`కు వేదిక కానుంది. రెహమాన్ తన గ్లోబల్ టచ్‌తో అంతర్జాతీయ స్థాయి సంగీతకారులను ఈ ప్రాజెక్ట్ కోసం ఏకం చేస్తుంటే, ఇళయరాజా తనదైన క్లాసికల్- ఎమోషనల్ టచ్‌తో రామాయణాన్ని ఎలా ఆవిష్కరిస్తారో చూడాలని అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

`వాల్మీకి రామాయణం` సాంకేతిక బృందం పరంగా కూడా అత్యంత బలంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బినోద్ ప్రధాన్ తన లెన్స్‌తో దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించనున్నారు. మరీ ముఖ్యంగా ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనర్‌గా పనిచేస్తుండటం ఈ సినిమా స్థాయిని పెంచింది. శ్రీరామనవమి సందర్భంగా అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రం ఇళయరాజా చేరికతో ఒక్కసారిగా ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రెహమాన్ తన చిత్రంలో అంతర్జాతీయ సంగీత శైలులను మేళవిస్తున్న క్రమంలో.. ఇళయరాజా కూడా అదే బాటలో పయనిస్తారా లేదా తనదైన దేశీయ శైలిలోనే మ్యాజిక్ చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు హాలీవుడ్ స్థాయి విజువల్స్ - రెహమాన్ సౌండ్ మ్యాజిక్, మరోవైపు ఇళయరాజా మెలోడీలు - రసూల్ పూకుట్టి సౌండ్ ఇంజనీరింగ్.. ఇలా రెండు చిత్రాలు దేనికవే సాటి అన్నట్లుగా తలపడుతున్నాయి. ఈ పోటాపోటీ వాతావరణం భారతీయ సినిమాకు ఒక కొత్త కళను అద్దబోతోంది.

భారీ అంచనాల మధ్య రూపొందుతున్న `వాల్మీకి రామాయణం` చిత్రాన్ని 2026 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దాదాపు అదే సమయంలో అంటే దీపావ‌ళి బ‌రిలో రెహమాన్ సంగీతం అందిస్తున్న `రామాయణం` మొద‌టి భాగం కూడా విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద కేవలం సినిమాలే కాదు.. ఇద్దరు సంగీత మాంత్రికుల ప్రతిభ కూడా తలపడనుంది. ఈ పోటీ అంతిమంగా ప్రేక్షకులకు ఒక మధురమైన అనుభూతిని మిగులుస్తుందనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News