రూ.55 కోట్ల వివాదం.. మురుగదాస్ ఫ్రీగా స్టోరీ ఇవ్వాల్సిందేనా?
ఒకప్పుడు కోలీవుడ్ స్టార్ దర్శకుడిగా టాప్ లో నిలిచిన ఏఆర్ మురుగదాస్ ప్రస్తుతం వరుస పరాజయాలతో పాటు వివాదాలతో సతమతమవుతున్నారు.;
ఒకప్పుడు కోలీవుడ్ స్టార్ దర్శకుడిగా టాప్ లో నిలిచిన ఏఆర్ మురుగదాస్ ప్రస్తుతం వరుస పరాజయాలతో పాటు వివాదాలతో సతమతమవుతున్నారు. గతంలో భారీ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించిన ఆయన, ఇటీవల తీసిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో కెరీర్ లో కాస్త వెనుకబడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పేరు మరో వివాదంలో వినిపించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
గతేడాది ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఒకటి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో తెరకెక్కించిన సికందర్ కాగా.. మరొకటి తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ తో రూపొందించిన మదరాసి. ఆ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ మిగిల్చాయి. ఇప్పుడు మదరాసి విషయంలో వివాదం తలెత్తింది.
ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఎన్వీ ప్రసాద్, తాజాగా తమిళ దర్శక నిర్మాతల మండలిలో మురుగదాస్ పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సినిమాను రూ.115 కోట్ల బడ్జెట్ లో పూర్తి చేస్తానని దర్శకుడు హామీ ఇచ్చినప్పటికీ, షూటింగ్ పూర్తయ్యేసరికి మొత్తం ఖర్చు రూ.170 కోట్లకు పెరిగిందని ఆయన ఆరోపించినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు రూ.55 కోట్ల మేర అదనపు వ్యయం జరిగిందని నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నారట.
బడ్జెట్ భారీగా పెరగడానికి సరైన ప్రణాళిక లేకపోవడం ప్రధాన కారణమని నిర్మాత వాదిస్తున్నారని వినికిడి. మదరాసి సినిమా పనులు కొనసాగుతూనే మురుగదాస్ సికందర్ చిత్రంపై కూడా దృష్టి పెట్టడం వల్ల షూటింగ్ వ్యవహారాలు గందరగోళంగా మారాయని తెలుస్తోంది. దీంతో ప్రాజెక్ట్ పై పూర్తి ఫోకస్ లేకపోవడం వంటి కారణాలతో ఖర్చులు అదుపు తప్పాయని సమాచారం.
అందుకే తమకు జరిగిన నష్టాన్ని కవర్ చేయాలని కోరుతూ నిర్మాత ఎన్వీ ప్రసాద్ రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ విషయంపై ఇరువర్గాల మధ్య చర్చలు జరిగిన అనంతరం.. విషయం తమిళ దర్శకులు, నిర్మాతల కౌన్సిల్ కు వెళ్లిందట. అక్కడ జరిగిన చర్చల తర్వాత ఒక పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
ఆ నిర్ణయం ప్రకారం, ఏఆర్ మురుగదాస్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తున్న రమణ 2 కథను సంబంధిత నిర్మాణ సంస్థకు ఉచితంగా అందించేందుకు అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రమణ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించగా, దాని సీక్వెల్‌గా భావిస్తున్న రమణ 2పై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ కథను ఉచితంగా ఇవ్వడం ద్వారా నిర్మాతకు జరిగిన నష్టాన్ని కొంత మేర పూడ్చాలని ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఒకప్పుడు టాప్ దర్శకుడిగా వెలుగొందిన మురుగదాస్ ఇప్పుడు వరుస ఫ్లాపులు, వివాదాలతో ఇబ్బందులు ఎదుర్కొంటుండటం గమనార్హం. మరి ఆ వివాదం ఇంతటితో ముగుస్తుందా? లేక ఇంకా కొత్త మలుపులు తిరుగుతుందా? అన్నదానిపై నెట్టింట ఇప్పుడు చర్చ జరుగుతోంది.