ఫ్రైడే రిలీజ్‌లు.. చిన్న సినిమాలే కానీ సర్ప్రైజ్ చేస్తాయా?

ఎండలు మండిపోతున్న సమయంలో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సినీ పరిశ్రమ సిద్ధమైంది. ప్రతి వారం లాగే శుక్రవారం (ఏప్రిల్ 17) కూడా కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.;

Update: 2026-04-16 10:20 GMT

ఎండలు మండిపోతున్న సమయంలో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సినీ పరిశ్రమ సిద్ధమైంది. ప్రతి వారం లాగే శుక్రవారం (ఏప్రిల్ 17) కూడా కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఈసారి పెద్ద హీరోల సినిమాలు కాకుండా, చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద లక్ ను టెస్ట్ చేసుకోనున్నాయి. ప్రమోషన్లతో ఆసక్తి పెంచిన ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాలు సాధిస్తాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలిచిన చిత్రం పాపం ప్రతాప్. తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ కు ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వం వహించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌ లో రూపొందిన ఆ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్‌ తో మంచి స్పందన తెచ్చుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట జీవితంలో జరిగే పరిణామాలను హాస్యంతో, భావోద్వేగాలతో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

మరోవైపు కిరణ్ అబ్బవరం నిర్మాణంలో రూపొందిన తిమ్మరాజుపల్లి టీవీ కూడా రేపు రిలీజ్ కానుంది. సాయితేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమాకు వి. మునిరాజు దర్శకత్వం వహించారు. దాదాపు కొత్త నటీనటులతో తెరకెక్కిన ఆ చిత్రం విలేజ్ నేపథ్యంతో రూపొందిన సస్పెన్స్ డ్రామా. టీజర్, ట్రైలర్‌ తో ఆ సినిమాపై కూడా మంచి బజ్ ఏర్పడింది.

ఇక నాగశౌర్య హీరోగా నటించిన బ్యాడ్ బాయ్ కార్తీక్ కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ దేశినా దర్శకత్వం వహించిన సినిమాలో విధి హీరోయిన్‌ గా నటించింది. దాదాపు మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఆ సినిమా చివరకు విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్లు పెద్దగా అనిపించకపోయినా, కంటెంట్‌ పై మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.

ఈ మూడు సినిమాలతో పాటు మిస్టర్ ఎక్స్, తెరచాప, కాలగమనం, గాలి వంటి మరికొన్ని చిన్న స్ట్రయిట్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదలకు రెడీ అయ్యాయి. వీటిలో ఎక్కువగా కొత్త కాన్సెప్టులతో, ప్రయోగాత్మక కథలతో వచ్చిన సినిమాలే ఉండడం విశేషం. ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే, మలయాళ నటుడు టొవినో థామస్ నటించిన పళ్లి చట్టంబిపై మోస్తరు అంచనాలు ఉన్నాయి.

1950-60ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది. ట్రైలర్ ద్వారా ఆ సినిమాపై ఆసక్తి పెరిగింది. మొత్తానికి ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలదే హవా కనిపిస్తోంది. పాపం ప్రతాప్, తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలు ప్రమోషన్లతో మంచి బజ్ క్రియేట్ చేసుకోగా, మిగతా సినిమాలు మోస్తరు అంచనాలతో బరిలోకి దిగుతున్నాయి. ఇప్పుడు ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో, ఏ సినిమా సర్ప్రైజ్ హిట్‌ గా నిలుస్తుందో చూడాలి. బాక్సాఫీస్ వద్ద ఫ్రైడే సినిమాలు అనుకున్న రేంజ్‌ లో నిలుస్తాయా లేదా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Tags:    

Similar News