అనుష్క 'ఘాటి'కి రిలీజ్ కష్టాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలు రిలీజ్‌కు నోచు కోకపోవడంతో నష్టాలు భరించలేక ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్‌కు పిలుపు నివ్వడం తెలిసిందే.;
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలు రిలీజ్‌కు నోచు కోకపోవడంతో నష్టాలు భరించలేక ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్‌కు పిలుపు నివ్వడం తెలిసిందే. అయితే పెద్ద సినిమాలు, పాపులర్ స్టార్స్ నటించిన సినిమాలకు థియేటర్లు, సరైన రిలీజ్ డేట్ లభించని పరిస్థితుల తలెత్తుతున్నాయి. దీంతో చాలా వరకు సినిమాలు కొన్ని నెలలుగా రిలీజ్‌కు నోచుకోవడం లేదు. సరైన రిలీజ్ డేట్, ఎలాంటి పోటీ లేని సమయం లభించితే తమ సినిమాలని థియేటర్లలోకి తీసుకురావాలని చాలా మంది నిర్మాతలు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు.
ఇదే పరిస్థితిని స్వీటీ అనుష్క నటించిన 'ఘాటి' కూడా ఎదుర్కొంటోంది. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ ఈ మూవీని సొంత సంస్థలో నిర్మించాడు. అనుష్క క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ మూవీకి గత కొన్ని రోజులుగా రిలీజ్ కష్టాలు వెంటాడుతున్నాయి. తమిళ హీరో విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వై. రాజీవ్‌రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.
గంజాయి మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా దీన్ని క్రిష్ తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న ఈ మూవీలో మునుపెన్నడూ చూడని వైలెంట్ క్యారెక్టర్‌లో అనుష్క నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. టీజర్ రిలీజ్ చేసిన టీమ్ మూవీని ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్‌ని టీమ్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
అయితే తాజాగా జూన్ రెండవ వారంలో ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. అయితే అదే సమయంలో అంటే జూన్ మొదటి వారంలో కమల్ హాసన్ 'థగ్ లైఫ్', రెండవ వారంలో పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు', మూడవ వారంలో ధనుష్ 'కుబేర', నాలుగవ వారంలో మంచు విష్ణు `కన్నప్ప` రిలీజ్ అవుతున్నాయి. దీంతో అనుష్క `ఘాటి`కి నో ఛాన్స్. దీంతో టీమ్ ఈ మూవీని జూలై రెండవ వారంలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.
జూలై మొదటి వారంలో విజయ్ దేవరకొండ `కింగ్ డమ్` రిలీజ్ కాబోతోంది. దీంతో జూలై రెండవ వారం ఖాలీగా ఉండటంతో దాన్ని వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. టీమ్ అనుకున్నట్టే 'ఘాటి' జూలై రెండవ వారంలో అయినా థియేటర్లలోకి వస్తుందా? లేక మళ్లీ వాయిదా పడుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.