ఓటీటీల్లో ఇప్పుడొస్తుందంతా చెత్త అనేసిన డైరెక్టర్!
అనురాగ్ కశ్యపై బాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేసి ఇకపై హిందీలో సినిమాలు చేయ నంటూ వ్యాఖ్యా నించిన సంగతి తెలిసిందే.;
అనురాగ్ కశ్యపై బాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేసి ఇకపై హిందీలో సినిమాలు చేయ నంటూ వ్యాఖ్యా నించిన సంగతి తెలిసిందే. సౌత్ లో మాత్రమే సినిమాలు చేస్తానని శబదం చేసి మరీ వచ్చాడు. కట్ చేస్తే ఇక్కడా అవకాశాలు రాకపోవడంతో పాన్ ఇండియా సినిమాలపై నిప్పులు కురిపించాడు. పాన్ ఇండియా సినిమాలు సుద్ద దండగా అంటూ...అందులో లాభాలు కంటే నష్టాలే వస్తాయని ఆరోపించి మరోసారి హైలైట్ అయ్యాడు.
దీంతో సౌత్ లో అవకాశాలు రాకపోవడంతోనే ఇలా ఆవేదన చెందుతున్నాడంటూ ప్రచారం సాగింది. తాజాగా ఓటీటీ కంటెంట్ పై కూడా నిప్పులు చెరిగాడు. అమెజాన్..నెట్ ప్లిక్స్ కంటెంట్ ని తీవ్ర స్థాయిలో విమర్శించాడు. ఈ రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో వస్తున్న కంటెంట్ సాధారణ టీవీ సీరియల్స్ కంటే దారుణంగా ఉందని ఆరోపించారు. ఓటీటీలు సబ్‌స్క్రిప్షన్లు, లాభాలు పెంచుకోవడంపైనే దృష్టి పెడుతు న్నారు తప్ప నాణ్యమైన కంటెంట్ అందించడం లేదని మండిపడ్డాడు.
ప్రేక్షకులను ఆకట్టుకునేలా అల్గారిథమ్‌లను అనుసరించడం వల్ల క్రియేటివిటీ, కళాత్మక విలువలు తగ్గి పోతున్నాయన్నారు. ఓటీటీలు ఆరంభంలో కొత్త కథలు చెప్పడానికి, విభిన్నమైన సినిమాలు తీయడానికి మంచి వేదికలుగా ఉండేవి. ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించేవారు. నెట్ ప్లిక్స్ తో చేసిన `సేక్రెడ్ గేమ్స్`, `లస్ట్ స్టోరీస్` వంటి ప్రాజెక్టులు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు.
`అలాంటి కథలిప్పుడు భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించలేదు. కథల్లో పూర్తిగా నాణ్యత లోపించిం దన్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా కడుపులో నీళ్లు కదలకుండా ఉంటే చాలు అని వివాదాస్పద కంటెంట్ జోలికి వెళ్లడం లేదు. సాహసం చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఇలా కొనసాగితే నిజమైన కళను, సినిమాను ప్రోత్సహించినట్లు కాదని అభిప్రాయపడ్డారు. కంటెంట్ లో నాణ్యత టెలివిజన్ ఛానల్ కంటే దారుణంగా దిగజారిపోయిందన్నారు.