అనుపమ 'పరదా'.. వచ్చేది ఎప్పుడంటే?
ఈ చిత్రంలో అనుపమతో పాటు దర్షన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.;
అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా వస్తున్న చిత్రం ‘పరదా’ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా, వినూత్న కథాంశంతో వస్తోందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ‘సినిమా బండి’ దర్శకుడు ప్రవీణ్ కందరగుల ఈ సినిమాతో మరోసారి భావోద్వేగాలు, సామాజిక అంశాలను హైలెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రంలో అనుపమతో పాటు దర్షన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్‌లో కనిపించిన వారి నటనకు మంచి స్పందన లభించింది. అనుపమ ఒక పల్లెటూరి అమ్మాయిగా.. సంప్రదాయాల నేపథ్యంలో సాహసయాత్ర సాగించాల్సి వచ్చే కథాంశంతో ఈ సినిమా సాగనుంది. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ చిత్రం వినూత్న కథను అందించబోతోంది.
తాజాగా విడుదలైన పోస్టర్‌లో అనుపమ లుక్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో ఆమె లుక్‌తో పాటు, వెనుక భాగంలో దేవత విగ్రహం కనిపించేలా పోస్టర్ డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌లోనే విడుదల తేదీ కూడా ప్రకటించారు. రాబోయే ఆగస్టు 22న ‘పరదా’ సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. అలాగే విడుదల చేసిన “యాత్ర నార్యాస్తు” అనే పాటకు కూడా మంచి స్పందన వస్తోంది.
ఈ పాటను సంగీత దర్శకుడు గోపీసుందర్ కంపోజ్ చేశారు. వినూత్న సంగీతం, అర్థంతో కూడిన సాహిత్యం, అన్నీ కలిసి ఈ చిత్రంలోని పాటలను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఫోక్ నృత్యాలు, సాంప్రదాయ కళలతో ఈ పాటను తెరకెక్కించిన విధానం కూడా వినూత్నంగా ఉంది. ఈ పాటలో వినిపించే ఉత్సాహభరితమైన టోన్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది.
‘పరదా’ సినిమా కథ, నేపథ్యం, కథానాయిక పాత్రల ప్రాధాన్యత.. ఇవన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపే అంశాలు. ముఖ్యంగా శ్రావణ మాసం సందర్భంగా కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు కాబట్టి ఆగస్టు 22న రిలీజ్ డేట్ చాలా సరైన ఛాయిస్ గా మారింది. అనుపమ నటనకు ఇప్పటికే మార్కెట్‌లో క్రేజ్ ఉంది. ఆమె ఈ సినిమాలోని పాత్రతో మరోసారి తన నటనను నిరూపించుకునే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువా కలిసి నిర్మిస్తున్నారు