అనిరుధ్ సౌండ్‌కి ఏమైంది? 'హుకుం' తెచ్చిన తంటా ఇదేనా..

తనే క్రియేట్ చేసుకున్న ఆకాశమంత బెంచ్‌మార్క్ ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంటోందా అన్న డౌట్ రాక మానదు.

Update: 2026-09-29 17:30 GMT

ఒకప్పుడు అనిరుధ్ పేరు పోస్టర్ మీద పడిందంటే చాలు.. థియేటర్లలో స్పీకర్లు బద్దలైపోవాల్సిందే, యూట్యూబ్‌లో రికార్డులు గల్లంతవ్వాల్సిందే అన్నట్టుండేది పరిస్థితి. కానీ సీన్ కట్ చేస్తే, ఇప్పుడు అనిరుధ్ నుంచి ఏ కొత్త ట్రాక్ బయటకు వచ్చినా ఆడియన్స్ ముందుగా వెతికేది మాత్రం ‘హుకుం’ వైబ్ కోసమే. హీరో ఎవరైనా సరే, ఆ రేంజ్ గూస్‌బంప్స్ ఇస్తేనే కిక్కు.. లేదంటే వెంటనే 'అనిరుధ్ ఫామ్ తగ్గింది' అంటూ పెదవి విరిచేస్తున్నారు.

తనే క్రియేట్ చేసుకున్న ఆకాశమంత బెంచ్‌మార్క్ ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంటోందా అన్న డౌట్ రాక మానదు. ‘జైలర్’ టైమ్‌లో ‘హుకుం’ సాంగ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. రజినీ స్క్రీన్ ప్రెజెన్స్‌ను అనిరుధ్ బీట్ ఏ రేంజ్‌లో నిలబెట్టిందో చూశాం. అయితే అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. అప్పటి నుంచి ప్రతి స్టార్ హీరో సినిమాకూ అదే రేంజ్ మాస్ ఎలివేషన్, అదే లెవెల్ థియేటర్ ఎనర్జీ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

రీసెంట్‌గా ‘ది ప్యారడైజ్’ చూసుకున్నా.. కొన్ని సీన్లలో బిజిఎం వర్కవుట్ అయినా, ఓవరాల్‌గా సౌండ్ మరీ లౌడ్ అయిపోయిందని, సీన్‌తో సింక్ కాలేదన్న విమర్శలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ట్రోలర్స్ కూడా భూతద్దం పెట్టి మరీ తప్పులు వెతకడం మొదలుపెట్టేశారు. ఇక ఇప్పుడు ‘జైలర్ 2’ పరిస్థితి చూస్తుంటే ఇంకాస్త టెన్షన్ పెరుగుతోంది. కొత్త సాంగ్ 'వన్ సన్ వన్ మూన్' బయటకొచ్చిన నిమిషం నుంచే నెటిజన్లు ‘హుకుం’తో పోలికలు పెట్టేసి పోస్ట్‌మార్టం మొదలెట్టారు.

పాట బాగుందా లేదా అన్నది పక్కనపెట్టి, పాత మ్యాజిక్‌ను మ్యాచ్ చేయలేకపోయాడంటూ నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం రొటీన్ అయిపోయింది. అన్ని కథలకూ, అన్ని సీన్లకూ ఒకే టెంప్లేట్ బాదుడు పనికిరాదు కదా అన్న మినిమం లాజిక్‌ను కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రయోగాలు చేద్దామంటే 'అనిరుధ్ మార్క్ లేదు' అంటారు, ఎలివేషన్ ఇస్తే 'రొటీన్' అంటారు.

అన్నింటికీ మించి డజనుకు పైగా పాన్ ఇండియా ప్రాజెక్టులు ఒకేసారి లైన్‌లో పెట్టేయడం కూడా ఆయన అవుట్‌పుట్‌పై ఎఫెక్ట్ పడుతోందా అన్న గుసగుసలు గట్టిగానే ఉన్నాయి. చేతినిండా సినిమాలు, నెత్తిన డెడ్‌లైన్లు ఉన్నప్పుడు సహజంగానే క్వాలిటీ తేడా కొడుతుంది. అసలు అనిరుధ్ మ్యూజిక్‌లో నిజంగానే పదును తగ్గిందా? లేక ఆడియన్సే విపరీతమైన అంచనాలతో ఆయనపై లేనిపోని ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారా? అనే డౌట్స్ వస్తున్నాయి. ఈ సందేహాలకు సమాధానం దొరకాలంటే నెక్స్ట్ రాబోయే బిగ్ ట్రాక్స్‌తో అనిరుధ్ మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర ఆ పాత వైబ్రేషన్స్ చూపించాల్సిందే.

Tags:    

Similar News