నా తల్లి గనుక మరో బిడ్డను కనుంటే.. ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్!

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుటుంబంతో ఉన్న అనుబంధం ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2026-09-29 17:38 GMT

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుటుంబంతో ఉన్న అనుబంధం ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి, శోభు యార్లగడ్డ కుటుంబాలతో ఎంతో సానిహిత్యాన్ని కలిగి ఉండే ఎన్టీఆర్.. తాజాగా `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` ప్రీ-రిలీజ్ వేడుకలో రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయతో ఉన్న బంధం గురించి మాట్లాడారు. కార్తికేయతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తార‌క్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మా ఇద్దరి రిలేషన్‌షిప్ గురించి మాట్లాడే రోజు ఇంత త్వరగా వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు. తాను `స్టూడెంట్ నంబర్ 1` సినిమా మొదలుపెట్టినప్పుడు తన వయసు 17 సంవత్సరాలని, తనకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన కార్తికేయ నేడు ఒక నిర్మాతగా ఈ వేదికపై నిలబడతాడని ఆ రోజు అనుకోలేదని పేర్కొన్నారు. తన తల్లి గనుక మరో బిడ్డను కనుంటే అది క‌చ్చితంగా కార్తికేయ మాత్రమే అయి ఉండేవాడని, అంతలా తమ్ముడిగా తనకు దగ్గరయ్యాడని ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.

తన కెరీర్‌లో సినిమాలు స‌రిగ్గా ఆడేవి కావు అనిపించిన కష్టకాలంలో.. అభిమానుల ఆశలకు ఎలా న్యాయం చేయాలో తోచని సమయంలో కార్తికేయ తనకు అండగా నిలబడ్డాడని ఎన్టీఆర్ వెల్లడించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాల నిర్మాణంలో రాజమౌళి వెనుక ఎంత కష్టపడ్డాడో.. అలాగే తన వెనుక కూడా కార్తికేయ నిలబడి మద్దతుగా నిలిచాడని గుర్తుచేసుకున్నారు. తన మొహంపై వచ్చిన ప్రతి చిరునవ్వు వెనుక అత‌డున్నాడు. అలాగే కళ్ల వెంట నీళ్లు వచ్చిన ప్రతిసారీ తుడిచిన చేతుల్లో కార్తికేయ చేయి కూడా ఉందని చెప్పి ఎన్టీఆర్ ఎంత‌గానో ఎమోషనల్ అయ్యారు.

తాను ఈ వేదికపై సరదాగా నవ్విద్దామని అనుకున్నా కానీ... కార్తికేయతో ఉన్న బంధాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యానని ఎన్టీఆర్ తెలిపారు. మొదటిసారి నిర్మాతగా మారుతున్న కార్తికేయ `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని.. నన్ను ఎలాగైతే ఆశీర్వదించారో నా తమ్ముడిని కూడా అలాగే ఆశీర్వదించాలని కోరారు. అలాగే ఈ తొలి ప్రయత్నానికి అండగా నిలిచిన నిర్మాత శోభు యార్లగడ్డకు.. ఇతర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్టీఆర్ మాట్లాడిన ఈ మాటలు కేవలం ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోని ప్రసంగం మాత్రమే కాకుండా.. ఇండస్ట్రీలో ఒకరికొకరు ఇచ్చే నైతిక స్థైర్యానికి, నిజమైన అనుబంధానికి ప్రతీకగా నిలిచాయి. కార్తికేయ తొలి నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి.




Tags:    

Similar News