అనిల్ రావిపూడి హిట్ల వెనుక ఈ సీక్రెట్‌ను ఎవరూ గమనించలేదే!

గత కొన్నేళ్లుగా అనిల్ రావిపూడి కెరీర్‌ను పరిశీలిస్తే, ఆయన స‌క్సెస్‌ల వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఆడియ‌న్స్ తో నిరంతర అనుబంధం కూడా ఒకటిగా కనిపిస్తుంది.

Update: 2026-06-06 07:04 GMT

డైరెక్ట‌ర్లు సాధారణంగా కెమెరా వెనుకే ఉండటానికి ఇష్టపడతారు. తమ సినిమాల షూటింగ్, స్క్రిప్ట్ వ‌ర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలతోనే ఎక్కువ టైమ్ గడుపుతారు. మీడియా ఇంటర్వ్యూలు లేదా టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపించడం కూడా చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఈ విషయంలో డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నారు. ఒకవైపు వరుస స‌క్సెస్‌ల‌తో స్టార్ డైరెక్టర్‌గా తన స్థానాన్ని బలపరుచుకుంటూనే, మరోవైపు టెలివిజన్ షోలు, పబ్లిక్ ఈవెంట్లు, ఎంట‌ర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో చేయబోయే సంక్రాంతి సినిమా కోసం రెడీ అవుతున్న టైమ్ లో కూడా అనిల్ టీవీ షోలకు టైమ్ ను కేటాయించడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

గత కొన్నేళ్లుగా అనిల్ రావిపూడి కెరీర్‌ను పరిశీలిస్తే, ఆయన స‌క్సెస్‌ల వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఆడియ‌న్స్ తో నిరంతర అనుబంధం కూడా ఒకటిగా కనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం, మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు వంటి భారీ స‌క్సెస్‌ల‌ తర్వాత కూడా ఆయన తనను తాను కేవలం డైరెక్ట‌ర్ గానే పరిమితం చేసుకోలేదు. ఇటీవల మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకు జడ్జిగా వ్యవహరించడం, ఆ తర్వాత మరో టెలివిజన్ కార్యక్రమంలో గెస్టుగా పాల్గొనడం దీనికి ఉదాహరణ. సాధారణంగా ఒక స్టార్ డైరెక్టర్‌ సినిమా డెడ్‌లైన్లు, స్టోరీ డిస్క‌ష‌న్స్, ప్రీ ప్రొడక్షన్ వ‌ర్క్స్ తో బిజీగా ఉంటారు. అలాంటి టైమ్ లో టీవీ షోల కోసం టైమ్ కేటాయించడం అనేది కేవలం హాబీగా కాకుండా ఒక స్ట్రాట‌జిక్ డెసిష‌న్ గా కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్సే తన సినిమాలకు ప్రధాన బలం అని తెలుసుకున్న అనిల్, అదే వర్గంతో నేరుగా కనెక్ట్ అయ్యే వేదికగా టీవీని వాడుకుంటున్న‌ట్టు అనిపిస్తోంది.

అనిల్ సినిమాల ప్రధాన బలం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఆయన రూపొందించే కథల్లో కుటుంబ బంధాలు, సరదా హాస్యం కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో టెలివిజన్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కుటుంబ ప్రేక్షకుల అభిరుచులను మరింత దగ్గరగా పరిశీలించే అవకాశం ఆయనకు లభిస్తోంది. షోల్లో పాల్గొనే సాధారణ కుటుంబాలు, జంటలు, వారి రియాక్ష‌న్స్, వారి ఆలోచనా విధానం వంటి అంశాలు ఒక రైట‌ర్ గా, డైరెక్ట‌ర్ గా కొత్త ఇన్‌పుట్స్‌ను అందించే అవకాశమూ ఉంది. అందుకే కొందరు సినీ విశ్లేషకులు టీవీ షోలను అనిల్ కేవలం వినోద వేదికగా కాకుండా, ప్రేక్షకుల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే ఒక రీసెర్చ్ ప్లాట్‌ఫామ్‌గా కూడా ఉపయోగిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

ఇదే టైమ్ లో అనిల్ లో మరో ప్రత్యేకత కూడా కనిపిస్తోంది. చాలా మంది డైరెక్ట‌ర్లు స్టార్ హీరోలు, భారీ బడ్జెట్లు, పాన్ ఇండియా ప్రాజెక్టుల వైపు పరుగులు తీస్తుంటే, అనిల్ మాత్రం తన బలమైన మార్కెట్‌ను అర్థం చేసుకుని అదే దిశగా ముందుకు సాగుతున్నారు. సంక్రాంతి సీజన్‌ను తనకు అనుకూలమైన బ్రాండ్‌గా మార్చుకోవడంతో పాటు, టెలివిజన్ ద్వారా ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో తన గుర్తింపును మరింత బలపరుస్తున్నారు. అందుకే ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియ‌న్స్ నుంచి రిలీజ్‌కు ముందే ఒక ప్రత్యేక ఆదరణ ఏర్పడుతోంది.

మొత్తానికి అనిల్ రావిపూడి జ‌ర్నీని చూస్తే, ఆయన స‌క్సెస్ సీక్రెట్ కేవలం మంచి కథలు చెప్పడంలోనే లేదని.. ప్రేక్షకుల మధ్య ఉంటూ, వారి అభిరుచులను ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవడం, మీడియా వేదికలను కూడా తెలివిగా ఉపయోగించుకోవడంలో కూడా ఉంద‌ని అర్థ‌మ‌వుతుంది. అందుకే నేటి టాలీవుడ్‌లో అనిల్ రావిపూడి కేవలం కెమెరా వెనుకే కాదు.. కెమెరా ముందూ సక్సెస్ అవుతున్న అరుదైన డైరెక్ట‌ర్‌గా నిలుస్తున్నారు.

Tags:    

Similar News