ఫామ్ లో లేని హీరోయిన్ తో రావిపూడి.. హిట్టిస్తాడా?
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో ముందుకు వస్తున్నారు.;
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో ముందుకు వస్తున్నారు. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో, నెక్స్ట్ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఆయన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. 2027 సంక్రాంతి కానుకగా ఆ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి.
ఇక ఆ సినిమాలో హీరోయిన్ ఎంపికపై కూడా ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. చాలా రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ, కృతి శెట్టి సినిమాలో హీరోయిన్ గా నటించనున్నట్టు అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించారు. ఇటీవల జరిగిన లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (LIK) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొన్న ఆయన, తన స్పీచ్ ఆ విషయాన్ని సూటిగా చెప్పేశారు.
"కృతి శెట్టి.. ఎప్పుడో ఉప్పెన సినిమా నుంచి అన్ని లాంగ్వేజెస్ కవర్ చేసింది. త్వరలో నాతో వర్క్ చేద్దామని చెప్పింది. ఆల్రెడీ బయట వార్తలు రాసేశారు. మనం అఫీషియల్ గా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే బ్రదర్స్ అంతా రాస్తారు" అంటూ రావిపూడి రివీల్ చేశారు. త్వరలోనే సెట్స్ లో కలుద్దామంటూ అనిల్ చేసిన కామెంట్స్ తో కృతి శెట్టి సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నటించనున్నట్లు స్పష్టమైంది.
దీంతో ఆ జంటపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల కాలంలో కృతి శెట్టి కెరీర్ అనుకున్న జోష్ లో లేదని చెప్పాలి. ఉప్పెనతో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత, ఆమెకు సరైన హిట్లు దక్కలేదు. తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేసినా, అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. దీంతో ఆమె కెరీర్ పై సందేహాలు వ్యక్తమవుతున్న సమయంలో, రావిపూడి వంటి దర్శకుడి సినిమాలో అవకాశం రావడం ఆమెకు మంచి అవకాశమని చెప్పాలి. సినిమా హిట్ అయితే ఆమెకు తెలుగులో ఛాన్సులు పక్కా వస్తాయని చెప్పొచ్చు.
ఇక కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే, ఆయనకు ఇటీవల కాలంలో పెద్దగా విజయాలు దక్కలేదు. అయితే తన కెరీర్ ప్రారంభంలో అనిల్ రావిపూడికి మొదటి అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్. ఇప్పుడు ఆయనతో మళ్లీ సినిమా చేస్తున్నారు. మరోవైపు వెంకటేష్ తో అనిల్ రావిపూడి కాంబినేషన్ ఇప్పటికే మంచి విజయాలు సాధించింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. మరోసారి ఆ కాంబో రిపీట్ అవుతుండటం విశేషం. దీంతో రావిపూడి మల్టీస్టారర్ పై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.