టాలీవుడ్ పై కన్నేసిన మలయాళ బ్యూటీ!
| మలయాళ నటి అనస్వర రాజన్ టాలీవుడ్, కోలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే రోషన్ మేక సరసన ‘ఛాంపియన్’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆమె, ‘ఇట్లు అర్జున’, ‘7జీ రెయిన్బో కాలనీ 2’ చిత్రాల్లో నటిస్తోంది. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘కాకా’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలు సక్సెస్ అయితే తెలుగులో అనస్వరకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.
మాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి దిగుమతై సత్తా చాటిన భామలెంతో మంది. ముంబై భామల తర్వాత ఆ రేంజ్ లో ఫేమస్ అయింది కేరళ కుట్టీలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. నయనతార, సాయి పల్లవి, నిత్యా మీనన్, మాళవిక మోహనన్, నివేదా థామస్, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, సంయుక్తా మీనన్ వంటి భామలు టాలీవుడ్ లో ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే. తాజాగా ఇదే బాటలోనే మరో మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ టాలీవుడ్ ..కోలీవుడ్ కోటలను కైవసం చేసుకునేందుకు సిద్దమైంది.
మలయాళంలో `తన్నీర్ మథన్ దినంగల్`, `నేరు`, `సుపర్ శరణ్య` వంటి హిట్ చిత్రాలతో నేచురల్ పెర్ఫార్మర్గా పేరు తెచ్చుకున్న అమ్మడు ఇప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది. సొంత ఇండస్ట్రీలో వరుస హిట్లు అందుకోవడంతో పాటు ఫిల్మ్‌ఫేర్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న అమ్మడు క్యూట్ లుక్స్ .. నటనతో తెలుగు మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. హోమ్లీ లుక్‌తో పాటు కథానాయికగా ఏ తరహా పాత్రనైనా పండించగల ప్రతిభ ఉండటంతో టాలీవుడ్ నుంచి సొగసరికి అవకాశాలు తలుపు తడుతున్నాయి.
దక్షిణాదిలో మార్కెట్‌ను విస్తరించుకునేందుకు ఇదే సరైన సమయమని భావించిన బ్యూటీ టాలీవుడ్ వైపు వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే రొషన్ మేక సరసన `ఛాంపియన్` చిత్రంతో టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కినేని నాగార్జున సమర్పణలో రూపొందుతున్న `ఇట్లు అర్జున` అనే క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. అలాగే `7 జీ రెయిన్ బో కాలనీ 2`లోనూ అమ్మడు ఎంపికైంది. `బృందావన కాలనీ` సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రమిది.
అలాగే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న `కాకా` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈసినిమా గనుక హిట్ అయితే అనస్వర పేరు టాలీవుడ్ లో మారు మ్రోగిపోతుంది. దీంతో పాటు హీరోయిన్ గా ఎంపికైన చిత్రాలు సక్సెస్ అయితే టాలీవుడ్ లో అమ్మడి ఇమేజ్ కి తిరుగుండదు. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న యంగ్ హీరోలకు కొత్త భామలు అవసరం. కాస్త పాపులర్ అయిన నటీమణులైతే మార్కెట్ పరంగా కలిసొస్తుందని భావిస్తున్నారు. పాత్రలకు సెట్ అవుతున్న కొంత మంది హీరోయిన్లు అందుబాటులో ఉన్నా? మార్కెట్ లేమి కారణంగా మేకర్స్ వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారంతా? ఫేమస్ అయిన యువ భామల వైపు చూసే అవకాశం ఉంటుంది.