లైగర్ బ్యూటీకి ఊహించని వరుస షాక్‌లు
`లైగర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనన్య పాండే. దురదృష్టవశాత్తూ విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ హీరోతో లాంచ్ అయినా ఆశించిన హిట్టు దక్కలేదు.;
`లైగర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనన్య పాండే. దురదృష్టవశాత్తూ విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ హీరోతో లాంచ్ అయినా ఆశించిన హిట్టు దక్కలేదు. టాలీవుడ్ లో తొలి ప్రయత్నమే డిజాస్టర్ అవ్వడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. అయితే `లైగర్` తర్వాత ఈ బ్యూటీ సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. అదే సమయంలో తన పరిశ్రమ సహచరుడు ఆదిత్యరాయ్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో పడటంతో కెరీర్ కంటే వ్యక్తిగత జీవితానికే ఎక్కువ సమయం కేటాయించింది. కానీ చివరికి ఆ లవ్ కూడా బ్రేకప్ అయింది.
లైగర్ తర్వాత బ్రేక్ తీసుకుని కొన్ని వరుస చిత్రాల్లో నటించింది. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ, డ్రీమ్ గార్ల్ 2, బ్యాడ్ న్యూజ్, సిఆర్.టిఎల్, కేసరి చాప్టర్ 2 లాంటి చిత్రాల్లో నటించినా ఇవేవీ ఆశించిన విజయం సాధించలేదు. సిఆర్‌టిఎల్‌లో అనన్య నటనకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ సరసన తూ మేరి మే తేరా మై తేరా అనే చిత్రంలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ప్రమోషన్స్ లో అనన్య బిజీగా ఉంది. కానీ ఇది కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లను సాధించకపోవడంతో అనన్యకు తీవ్ర నిరాశను మిగిల్చింది. తూ మేరీ.. బాక్సాఫీస్ వద్ద పూర్ ఓపెనింగులతో సరిపెట్టుకుందని సాక్ నిల్క్ తన కథనంలో పేర్కొంది.
ఈ క్రిస్మస్ సెలవులు కూడా తూ మేరీ చిత్రానికి కలిసి రావడం లేదు. సెలవు రోజుల్లో అత్యంత వీక్ కలెక్షన్లతో ప్రారంభమైన చిత్రంగా అనన్య సినిమా రికార్డులకెక్కింది. ఈ చిత్రం భారతదేశంలో డే వన్ లో దాదాపు రూ. 7.75 కోట్ల నికర వసూళ్లను సాధించిందని శాక్ నిల్క్ పేర్కొన్నా..ఇది ఫేక్ గణాంకం అంటూ కొందరు విమర్శించారు. ఈ చిత్రం కేవలం రూ. 5 కోట్లు లేదా అంతకంటే తక్కువ వసూలు చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సన్నీ సంస్కారి కి తులసి కుమారి, పరమ్ సుందరి లాంటి సినిమాతో ఈ సినిమాని కూడా పోల్చారు. అంతగా క్రేజ్ లేని జంట అంటూ కొందరు నిరసించారు. చాలా మంది ఈ సంఖ్యలు అధ్వాన్నంగా ఉన్నాయని విమర్శించారు.
నిజానికి కార్తీక్ ఆర్యన్ సక్సెస్ లో ఉన్న హీరో. కానీ ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్ తో జతకట్టి తప్పు చేసారని కొందరు క్రిటిసైజ్ చేస్తున్నారు. అయితే దురంధర్, అవతార్ 3 లాంటి భారీ చిత్రాల నడుమ ఈ సినిమా ఆశించిన విధంగా రాణించలేకపోయిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సమయంలో దీనిని రిలీజ్ చేసి ఉండాల్సింది కాదని కొందరు విశ్లేషించారు. భయంకరమైన టైటిల్, బలహీనమైన ట్రైలర్, గుర్తుంచుకోని పాటలు ప్రేక్షకులు ఈ చిత్రానికి దూరంగా ఉండటానికి ప్రధాన కారణాలు అని ఒకరు విశ్లేషించారు. త్వరలో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన వార్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇక్కిస్ విడుదలకు వస్తోంది. ఆ తర్వాత కార్తీక్- అనన్యల తూ మేరి చిత్రం కలెక్షన్లు ఇంకా దిగజారేందుకు అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. దీనిని బట్టి రాంగ్ టైమింగ్ తో విడుదల చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.