అంబానీ బర్త్‌డే వేడుకలు: ఔరా! మందు- మత్తు లేదు.. భజన్స్ కీర్తన్స్‌లో తరించిన సినీతారలు!
ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి రణ్‌వీర్ సింగ్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్, వీర్ పహారియా, గౌరీ ఖాన్ , అబ్ రామ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.;
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీల సందడి గురించి తెలిసిందే. ఇప్పుడు అనంత్ అంబానీ 31వ పుట్టినరోజు వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అత్యంత వైభవంగా జరిగాయి.. ఈ వేడుకలు ఆధ్యాత్మికతతో ప్రత్యేకతను సంతరించుకోవడం నెటిజనుల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా సెలబ్రిటీల పుట్టినరోజు వేడుకలు అంటే కేవలం హై-ఎనర్జీ డ్యాన్స్ పార్టీలే ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ అనంత్ అంబానీ తన పుట్టినరోజున భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ నిర్వహించిన `భజన్స్ క్లబ్బింగ్` సెషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వేడుకలో ఆడంబరం కంటే ఆధ్యాత్మికత, సంస్కృతి మేళవింపు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి రణ్‌వీర్ సింగ్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్, వీర్ పహారియా, గౌరీ ఖాన్ , అబ్ రామ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఒకవైపు అపర కుబేరుల వేడుక అయినా అక్కడి వాతావరణం ఎంతో పవిత్రంగా, ఆత్మీయంగా సాగింది. భజన కార్యక్రమంలో సినీ తారలు సైతం తమ స్టార్ హోదాని పక్కన పెట్టి భక్తి గీతాల ఆలపనలో మైమరిచిపోవడం విశేషం. ఈ అరుదైన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వేదికగా వైరల్ అవుతూ మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తున్నాయి.
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ స్వయంగా భజనలో పాల్గొనగా.. రాధికా మర్చంట్ తన భర్త అనంత్ అంబానీ సరసన కూర్చుని ఈ ఆధ్యాత్మిక వేడుకను ఆస్వాధించారు. ఈ ప్రత్యేక భజన సెషన్‌లో ఇషా అంబానీ కూడా సంగీతానికి అనుగుణంగా తన్మయత్వంతో లయబద్ధంగా కదలడం కనిపించింది. ఆధునికతను గౌరవిస్తూనే తమ మూలాలను, సంప్రదాయాలను విస్మరించకూడదనే అంబానీ కుటుంబ జీవనశైలికి ఈ వేడుక ఒక నిదర్శనంగా నిలిచింది. భక్తి సంగీతం ఒక పార్టీ వాతావరణాన్ని ఎంత ప్రశాంతంగా మార్చగలదో ఈ కార్యక్రమం నిరూపించింది.
గర్భా నృత్యాలు హైలైట్:
భజనలతో పాటు ఈ వేడుకలో గుజరాతీ సంస్కృతిని ప్రతిబింబించేలా `గర్బా` నృత్యాలు కూడా సందడి చేశాయి. నటి జాన్వీ కపూర్ ఇతర అతిథులతో కలిసి గర్బా ఆడుతూ అక్కడి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. జామ్‌నగర్‌లోని `వంటారా` ప్రాజెక్ట్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం కూడా నిర్వహించారు. మూగజీవాల సంరక్షణ కోసం అనంత్ అంబానీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంటారా వేదికపైనే ఈ వేడుకలు జరగడం ఆయనకు ప్రకృతి - జీవజాలంపై ఉన్న మమకారాన్ని చాటిచెప్పింది.
మొత్తానికి అనంత్ అంబానీ 31వ పుట్టినరోజు వేడుక గ్లామర్ - భక్తి కలగలిసిన ఒక అపురూప వేడుకగా నిలిచిపోయింది. సినిమా తారలు పబ్బు క్లబ్బు పార్టీలు.. బికినీ ఫోటో షూట్‌లు లేదా విదేశీ విహారయాత్రలతో బిజీగా ఉండే ఈ రోజుల్లో ఇలా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం చూస్తుంటే డెస్టినేషన్ ప్రమోషన్స్ అనవసర పార్టీల కంటే సంప్రదాయ వేడుకలే ఎక్కువ సంతృప్తిని ఇస్తాయని స్పష్టమవుతోంది. ఈ వేడుక కేవలం అంబానీ కుటుంబానికే కాకుండా హాజరైన అతిథులందరికీ ఒక తీపి జ్ఞాపకం అనడంలో సందేహం లేదు.
నేటి ఆధునిక కాలంలో అపర కుబేరులు సైతం తమ వేడుకల్లో ఆధ్యాత్మికతకు, సంప్రదాయ భజనలకు ప్రాధాన్యత ఇవ్వడం సమాజంలోని యువతపై గొప్ప ప్రభావాన్ని చూపగలదు. మంచి వైపు ఇది నడిపించగలదు. హిందీ సినీ ప్రముఖులు పార్టీలతో డ్రగ్ కల్చర్ ని విస్తరించారనే ప్రచారం నడుమ... అంబానీలు ఇలా సంస్కృతిని కాపాడే ప్రయత్నం చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది.