మెగాస్టార్ ఆస్తి 1600కోట్లు.. అయోధ్య‌లో 4వ ప్రాప‌ర్టీ!

ఇటీవల 25,000 చదరపు అడుగుల ప్లాట్‌ను అమితాబ్ రూ.40 కోట్లకు కొనుగోలు చేశాడు. బచ్చన్ గతంలో రూ.14.5 కోట్లను హై ఎండ్ `సరయు` రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ సమీపంలో ఈ ఫ్టాట్ (భూమి) ఉందని చెబుతున్నారు.;

Update: 2025-05-29 23:30 GMT

డ‌బ్బు సంపాదించ‌డం ఒక ఎత్తు. దానిని దాచుకోవడం, తెలివిగా పెట్టుబ‌డులు పెట్ట‌డం మ‌రొక ఎత్తు. దుబారా చేయ‌కుండా పెట్టుబ‌డుల‌తో వ్యాపారాల్ని వృద్ధి చేసే నైపుణ్యం చాలా అవ‌స‌రం. అయితే ఇలాంటి విద్య‌ల్లో ఆరితేరిపోయిన ఒక మెగాస్టార్ ని ప‌రిచ‌యం చేయాలి. ఉత్త‌రాది, ద‌క్షిణాది అనే తేడా లేకుండా నేడు దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల ప్రేమాభిమానాల‌ను చూర‌గొన్న ఈ మెగాస్టార్ మ‌రెవ‌రో కాదు.. ది గ్రేట్ అమితాబ్ బచ్చ‌న్. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చ‌న్ ప‌లు వ్యాపారాల్లో తెలివైన పెట్ట‌బ‌డులను వంద‌ల వేల కోట్ల సామ్రాజ్యంగా మారుస్తున్న వైనం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఏడాదికి క‌నీసం ప‌ది సార్లు అయినా ఆయ‌న పెట్టుబ‌డుల గురించి అపార్ట్ మెంట్ల కొనుగోళ్ల గురించి వినాల్సి వ‌స్తోంది. అత‌డు త‌న చేతికి వ‌చ్చిన ప్ర‌తి రూపాయిని తెలివైన, వ్యూహాత్మ‌క‌ పెట్టుబ‌డిగా మారుస్తున్నాడు.

బాల రాముడిని ఆవిష్క‌రించిన త‌ర్వాత అయోధ్యలో అమితాబ్ బచ్చన్ పెట్టుబడుల పర్వం కొనసాగుతోంది. అత‌డు అయోధ్య న‌గ‌రంలో తన నాల్గవ ఆస్తిని కొనుగోలు చేశాడని తాజాగా క‌థ‌నాలొస్తున్నాయి. మీడియా క‌థ‌నాల ప్ర‌కారం... ఇటీవల 25,000 చదరపు అడుగుల ప్లాట్‌ను అమితాబ్ రూ.40 కోట్లకు కొనుగోలు చేశాడు. బచ్చన్ గతంలో రూ.14.5 కోట్లను హై ఎండ్ `సరయు` రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ సమీపంలో ఈ ఫ్టాట్ (భూమి) ఉందని చెబుతున్నారు.

బాలీవుడ్ నిర్మాత ఆనంద్ పండిట్ యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ సంస్థలో ఇటీవల ఆయన రూ.20 కోట్ల పెట్టుబడి (ఒక్కొక్కటి రూ.10 కోట్లు) పెట్టిన‌ తర్వాత ఈ తాజా కొనుగోలు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. బచ్చన్ తన రియల్ ఎస్టేట్ పెట్టుబ‌డుల్ని వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ముఖ్యంగా రామాలయ అభివృద్ధి తర్వాత భారీ మౌలిక సదుపాయాలు, పర్యాటక రంగ వృద్ధిని అంచ‌నా వేసిన అమితాబ్ భ‌విష్య‌త్ లో ఆతిథ్య రంగంలో రాణించేందుకు అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

2024లో రామాలయ ప్రారంభోత్సవానికి ముందు బచ్చన్ 5,372 చదరపు అడుగుల ప్లాట్‌ను రూ.4.54 కోట్లకు కొనుగోలు చేయడంతో అయోధ్యలో బిగ్ బి పెట్టుబడుల ఫ‌ర్వం మొద‌లైంది. అమితాబ్ తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ ట్రస్ట్ కింద 54,000 చదరపు అడుగుల భూమిని రిజిస్ట‌ర్ చేసాడు. ఆ భూమిలో తన తండ్రికి ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాలని అమితాబ్ భావిస్తున్నట్లు క‌థ‌నాలొస్తున్నాయి. వ్యాపారం ఓవైపు.. అరుదుగా వ్యక్తిగత నివాళి మ‌రోవైపు.. ఇది అమితాబ్ లో కొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తోంది. రాబ‌డి డ‌బ్బు సంపాద‌న‌ల గురించి ఇలా చేయ‌డం లేద‌ని, అయోధ్య ఆధ్యాత్మిక సాంస్కృతిక అభివృద్ధిలో తాను భాగం కావాల‌నే అభిలాష‌ను క‌లిగి ఉన్నాన‌ని అమితాబ్ చెబుతున్నారు.

అయోధ్య సంగ‌తి అటుంచితే ఇటు ముంబైలో నిరంత‌రం ఏదో ఒక చోట ఆస్తిని కొంటూనే ఉన్నాడు బ‌చ్చ‌న్. అత‌డు ఇటీవల అంధేరీలో ఒక డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను రూ. 83 కోట్లకు అమ్మాడు. దీనిని 2021లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేయ‌గా, ఇది కేవలం మూడు సంవత్సరాలలో తన పెట్టుబడిని రెట్టింపును మించి పెంచింది. 2023లో అమితాబ్ ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ సంయుక్తంగా 10 అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేశారు. వాటి విలువ మొత్తం రూ. 25 కోట్లు ఉంటుంద‌ని తెలుస్తోంది. రియ‌ల్ రంగంలో తండ్రి కొడుకుల పెట్టుబ‌డులు నిజంగా ఆశ్చ‌ర్యం క‌లిగించాయి.

అలాగే నటి కం రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ గత సంవత్సరం ఎన్నికల అఫిడవిట్ లో బచ్చన్ కుటుంబం నికర ఆస్తి విలువ గురించి రివీల్ చేసారు. దీని ప్ర‌కారం...అమితాబ్- జ‌యాబ‌చ్చ‌న్ జంట మొత్తం ఆస్తుల విలువ రూ. 1,578 కోట్లు. వీటిలో రూ. 849.11 కోట్ల చరాస్తులు, రూ. 729.77 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.

Tags:    

Similar News