పుష్ప : అప్పుడు రష్యా, ఇప్పుడు జపాన్..!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప', 'పుష్ప 2' సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి.;
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప', 'పుష్ప 2' సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా పుష్ప 2 సినిమా పలు రికార్డ్‌లను బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్‌లను నమోదు చేసిన విషయం తెల్సిందే. అక్కడ, ఇక్కడ అనే తేడా లేకుండా ఇండియాలోని అన్ని చోట్ల పుష్ప 2 సినిమా సాధించిన వసూళ్లు సరికొత్త రికార్డ్‌లను నమోదు చేశాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో పుష్ప చేసిన సందడి అంతా ఇంతా కాదు. మెజార్టీ వసూళ్లు అక్కడ నుంచి వచ్చాయని నిర్మాతలు అంటూ ఉంటారు. ఇక విదేశాల్లోనూ ఈ సినిమాను విడుదల చేయడం ద్వారా మంచి వసూళ్లు సాధించింది. అమెరికాతో పాటు పలు దేశాల్లో ఈ సినిమా తెలుగు, హిందీ, ఇతర ఇండియన్ భాషల డబ్బింగ్ వర్షన్‌లు ప్రదర్శించడం ద్వారా వందల కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. ఇప్పుడు మరోసారి పుష్ప గురించిన చర్చ వచ్చింది. ఈ సారి పుష్ప సినిమా ఏకంగా జపాన్ లో విడుదలకు రెడీ అవుతుంది. ఇండియన్ సినిమాలకు జపాన్‌లో ఉన్న ఆధరణ నేపథ్యంలో పుష్ప 2 ను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.
అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2...
జపనీస్ ప్రేక్షకులు బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, దేవర సినిమాలను ఏ స్థాయిలో ఆధరించారో అందరికీ తెలిసిందే. ఇటీవల కల్కి సినిమాను సైతం జపనీస్ ప్రేక్షకులు తెగ అభిమానించి, హిట్ చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు పుష్ప 2 సినిమా అక్కడ విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి అక్కడ ప్రచారం చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. జపాన్‌లో జనవరి నెల సినిమాలకు మంచి సీజన్‌గా చెబుతూ ఉంటారు. అందుకే ఈ సినిమాను అక్కడ జనవరి నెలలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను జపాన్ లో చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ కోసం అక్కడ నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన జాబితాను స్థానిక పీఆర్ టీం రెడీ చేస్తుందని మైత్రి వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా...
జనవరి 16న జపాన్‌లో పుష్ప 2 సినిమాను విడుదల చేయబోతున్నారు. మొదటి పార్ట్‌కి సంబంధించిన కొన్ని సీన్స్ ను సైతం జత చేయడం ద్వారా కథ ను ఈజీగా అర్థం అయ్యే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిడివి విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని దర్శకుడు సుకుమార్ మరోసారి ఎడిటింగ్ రూంలో కుస్తీలు పడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి పుష్ప ను జపాన్‌లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. పుష్ప 2 సినిమాలో జపాన్ రిఫరెన్స్ ను ఉపయోగించారు. కొన్ని సీన్స్ అక్కడ చిత్రీకరించాల్సి వచ్చింది. ఆ సమయంలో అల్లు అర్జున్ జపనీస్ భాషలో చెప్పే డైలాగ్ ను తాజాగా ప్రోమోగా విడుదల చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. పుష్ప 2 సినిమాకి మంచి బ్రేక్ దక్కే విధంగా జపాన్‌లో భారీ రిలీజ్‌కి స్థానిక డిస్టిబ్యూటర్స్ ప్లాన్ చేస్తున్నారని మైత్రి వర్గాల వారు చెబుతున్నారు.
రష్మిక మందన్న హీరోయిన్‌గా, శ్రీలీల ఐటెం సాంగ్...
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల చేసిన ఐటెం సాంగ్ మంచి స్పందన దక్కించుకుంది. బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను పుష్ప 2 మెప్పించింది. అందుకే వెయ్యి కోట్లను మించి వసూళ్లు సాధించింది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా కి సంబంధించిన హడావిడి మళ్లీ మొదలు అయిన నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో మరోసారి ఈ సినిమా గురించి పాజిటివ్ గా చర్చించడం మొదలు పెట్టారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం సినిమా స్థాయిని మరో లెవల్‌కి తీసుకు వెళ్లడం జరిగింది. జపనీస్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమాను ఎడిట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలు జపాన్‌లో సాధించిన వసూళ్లతో పోల్చితే ఈ సినిమా సరికొత్త రికార్డ్‌లను నమోదు చేయబోతుంది అంటూ బన్నీ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మరి జపాన్‌లో పుష్ప రాజ్ ఎంత మేరకు సత్తా చాటుతాడు అనేది చూడాలి.