మెగాస్టార్ వారసుడే అయినా.. అల్లు అర్జున్ నోట అలాంటి మాట!
| ‘ఆకాశంలో ఒక తార’ ప్రీరిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుల్కర్ సల్మాన్ ఎంచుకునే కథలు, ఆయన సింప్లిసిటీ తనకు ఎంతో ఇష్టమని, దుల్కర్ నటించిన ప్రతి సినిమాను చూస్తానని తెలిపారు. కొత్త హీరోయిన్ సాత్వికకు ఇది డ్రీమ్ లాంచ్ అని పేర్కొన్నారు. తన తండ్రి అల్లు అరవింద్‌కు సినిమా బాగా నచ్చిందంటే అందులో విషయం ఉన్నట్లేనని బన్నీ అన్నారు.
హైదరాబాద్ వేదికగా ఘనంగా జరిగిన `ఆకాశంలో ఒక తార` చిత్ర ప్రీరిలీజ్ వేడుక సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయగా... ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తోటి నిర్మాతలతో కలిసి ఈ కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. చిత్ర కథానాయకుడు దుల్కర్ సల్మాన్ ఎంచుకునే కథలు, వైవిధ్యమైన పాత్రలు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా.. స్టార్ కిడ్ అయినా ఎంతో సింపుల్‌గా ఉండే అతడి నేచర్ తనకు చాలా ఇష్టమని చెప్పారు. దుల్కర్ నటించిన ప్రతి సినిమాని తాను చూస్తానని కూడా తెలిపారు. అలాగే కొత్త నటి సాత్వికకు ఇది చక్కటి డ్రీమ్ లాంచ్ అని.. తెలుగు చిత్రసీమలోకి సాదర స్వాగతం పలుకుతున్నామని అన్నారు. ఈ చిత్రంలో నటిస్తున్నఇతర నటీనటులు, టెక్నీషియన్ల పనితీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
తన తండ్రి అల్లు అరవింద్ - స్వప్న సినిమాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచీ పాజిటివ్ వైబ్ ఉందని బన్నీ పేర్కొన్నారు. ప్రతి మహిళ కల సాకారం కావడం అనే అందమైన పాయింట్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని..యూనిట్ అందరికీ ఘన విజయం సాధించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రి అశ్వనిదత్ తో కలిసి సినిమాలు తీసారని, తర్వాతి జనరేషన్ లో స్వప్నగారితోను సినిమాలకు కలిసి పని చేస్తున్నారని తెలిపారు. ఈ సినిమా చూసినప్పుడు నాన్న గారు ఇది ఎంతో బాగా నచ్చిందని తెలిపారు. ఆయన నా సినిమాలకు కూడా అలా చెప్పరు.. అలా అన్నారంటే సినిమాలో విషయం ఉందనే అర్థం అని అన్నారు.
ఇదే వేదికపై మాట్లాడిన అల్లు అరవింద్, ఈ సినిమా రషెస్ చూస్తున్నప్పుడే ఒక అద్భుతమైన కథను ప్రేక్షకులకు అందించబోతున్నామనే ఎగ్జయిట్‌మెంట్ కలిగిందని తెలిపారు. దుల్కర్ సల్మాన్ నటనతో పాటు రియల్ లైఫ్‌లోనూ ఎంతో ఒదిగి ఉంటారని.. సున్నితమైన మనసున్న మనిషి అని కొనియాడారు. పవన్ సాధినేని, జీవీ ప్రకాష్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.