బాలీవుడ్ సినిమాపై బన్నీ పొగడ్తలు
రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజైన దురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా, గూఢచారి కథగా తెరకెక్కిన దురంధర్ ఇప్పటికే రూ.218 కోట్ల కలెక్షన్లను అందుకుని మంచి థియేట్రికల్ రన్ తో దూసుకెళ్తూ రణ్‌వీర్ ఖాతాలో మంచి హిట్ గా నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న దురంధర్
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన దురంధర్ మంచి టాక్ తెచ్చుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేస్తుండటంతో ఈ సినిమాను చూసిన అందరూ చిత్ర యూనిట్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండగా, ఇప్పుడు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాను చూసి దురంధర్ పై తన అభిప్రాయాలను వెల్లడించారు.
దురంధర్ పై ఐకాన్ స్టార్ ప్రశంసలు
గురువారం సాయంత్రం అల్లు అర్జున్ హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో దురంధర్ చూసి, శుక్రవారం ఉదయాన్నే చిత్ర యూనిట్ ను ప్రశంసిస్తూ ఓ నోట్ ను పోస్ట్ చేశారు. దురంధర్ మూవీ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సులు, మంచి టెక్నికల్ వాల్యూస్ తో పాటూ ఆకట్టుకునే మ్యూజిక్ తో రూపొందిన ఓ మంచి చిత్రమని, ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.
డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ సినిమాను హ్యాండిల్ చేసిన విధానాన్ని మెచ్చుకున్న బన్నీ, సినిమాలో కీలక పాత్రల్లో నటించిన అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ యాక్టింగ్ ను కూడా పొగిడారు. తాను ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశానని, ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాలను చూసి ప్రోత్సహించాలని బన్నీ కోరగా, అల్లు అర్జున్ చేసిన పోస్ట్ కు రణ్‌వీర్ ఫ్యాన్స్ బన్నీకు కృతజ్ఞతలు చెప్తున్నారు.