ఐకాన్ స్టార్ - ICONZA .. ఇకపై కొత్త ఆఫీస్‌లో పాన్ వరల్డ్ టార్గెట్!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నారు.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అత్యాధునిక హంగులతో కూడిన సరికొత్త కార్యాలయాన్ని లాంచ్ చేసారు. తనదైన శైలిలో క్రియేటివ్ అప్రోచ్‌తో ముందుకు సాగుతున్న బన్నీ.. ఈ ఆఫీస్‌కు `ICONZA` అని నామకరణం చేయడం ప్రస్తుతం సినీ వర్గాల్లో .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. లెజెండరీ నటుడు, తన తాతయ్య పద్మశ్రీ అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ఈ ఆఫీస్‌ను లాంచ్ చేయడం విశేషం. ``ఒక కొత్త ఆఫీస్... ఒక కొత్త ప్రారంభం. మా తాతయ్య అల్లు రామలింగయ్య గారి జయంతి రోజున ఈ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాను`` అంటూ బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
అభిమానులు ముద్దుగా పిలుచుకునే `ఐకాన్` ట్యాగ్‌ను బేస్ చేసుకుని ఈ ప్రీమియం ఆఫీస్ స్పేస్‌ను తీర్చిదిద్దారు. ఇంటీరియర్స్, ఆర్కిటెక్చర్ అన్నీ తనే దగ్గరుండి మరీ అత్యంత స్టైలిష్‌గా డిజైన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమాలే కాకుండా... భవిష్యత్తులో బిజినెస్ వెంచర్స్, ప్రొడక్షన్ .. ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకే ఈ కార్పొరేట్ ఆఫీస్‌ను ఏర్పాటు చేసినట్లు సినీ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
`పుష్ప` చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన అల్లు అర్జున్, ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ రేంజ్ ప్రాజెక్ట్ `రాకా` షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో `ICONZA` ఆఫీస్ లాంచ్ కావడంతో ఇకపై ఆయన కేవలం పాన్ ఇండియాకే పరిమితం కాకుండా గ్లోబల్ లేదా పాన్ వరల్డ్ టార్గెట్‌గా మరింత పెద్ద అడుగులు వేస్తున్నారని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ప్రారంభోత్సవ వేడుకకు సంబంధించిన ఫ్యామిలీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అరవింద్‌తో పాటు కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో సందడి చేయగా.. అల్లు స్నేహా రెడ్డి కనిపించకపోవడం మాత్రం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఏది ఏమైనా.. తాతయ్య ఆశీస్సులతో బన్నీ ప్రారంభించిన ఈ `ICONZA` కొత్త ప్రయాణం టాలీవుడ్ తో పాటు వరల్డ్ సినిమాలో మరిన్ని సంచలనాలకు వేదికగా మారుతుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.