ఐకాన్ స్టార్ తో శక్తిమాన్ కాన్సెప్ట్ కాదా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి సన్నాహాలు చేస్తోన్నట్లు కొన్నాళ్లగా మీడియా కథనాలు అంతకంతకు హీటెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి సన్నాహాలు చేస్తోన్నట్లు కొన్నాళ్లగా మీడియా కథనాలు అంతకంతకు హీటెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ 90ల నాటి క్లాసిక్ సూపర్ హీరో షో `శక్తిమాన్` ఆధారంగా తెరకెక్కబోతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ పేరు కూడా వినిపించడంతో ఈ వార్తలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన `అదిరడి` చిత్ర దర్శకుడు అరుణ్ అనిరుధన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై వస్తోన్న పుకార్లకు పూర్తి చెక్ పెట్టారు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బాసిల్ జోసెఫ్ తదుపరి దర్శకత్వం వహించబోయే చిత్రం శక్తిమాన్ కాదన్నారు. అల్లు అర్జున్‌తో ఆయన చేయబోయే సినిమాకు దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చాలా మంది భావిస్తున్నట్లుగా ఇద్దరి కాంబినేషన్‌లో రాబోయే చిత్రం భిన్నమైన కథాంశంతో ఉండబోతోందని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తారని పేర్కొన్నారు. ఒకప్పుడు `శక్తిమాన్` స్క్రిప్ట్‌పై తాము పని చేసిన విషయాన్ని కూడా అరుణ్ ఈ సందర్భంగా అంగీకరించారు.
అరుణ్ సహా రచయిత పాల్సన్ స్కరియా కలిసి బాసిల్ జోసెఫ్ కోసం ఒక భారీ సూపర్ హీరో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశామని అనివార్య కారణాల వల్ల అది పట్టాలెక్కలేదని తెలిపారు. బాలీవుడ్‌లో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడం ఎంతో సంక్లిష్టంగా మారిందని ఎన్నో ఈగో సమస్యలు ,నిర్మాణపరమైన సవాళ్లు ఎదురవడంతో ఆ ప్రాజెక్ట్ తాత్కాలికంగా ఆగిపోయిందని వివరించారు. శక్తిమాన్ కథను అల్లు అర్జున్ వద్దకు ఎప్పుడూ తీసుకెళ్లలేదని తేల్చిచెప్పారు. అల్లు అర్జున్- బాసిల్ జోసెఫ్ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం గురించి కూడా పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఇటీవల అల్లు శిరీష్ వివాహ వేడుకకు బాసిల్ ప్రత్యేక అతిథిగా హాజరు కావడం ఊహాగానాలకు మరింత బలమిచ్చింది.
`మిన్నల్ మురళి` చిత్రాన్ని చూసిన అల్లు అర్జున్ బాసిల్ మేకింగ్ స్టైల్‌ను ఎంతగానో అభినందించారని అప్పటి నుంచి ఇద్దరు నిరంతరం టచ్‌లో ఉంటున్నారని చిత్ర బృందం తెలిపింది. బాసిల్ కూడా తాజా ఇంటర్వ్యూలలో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇదొక సుదీర్ఘమైన ప్రక్రియ అని సరైన సమయంలో అన్ని విషయాలు బయటకు వస్తాయని దాటవేశారు. మొత్తానికి శక్తిమాన్ కథ మాత్రం సినిమాగా రాలేకపోతుందన్నది కాదనలేని నిజంగా మరోసారి ప్రూవ్ అయింది. గతంలో శక్తిమాన్ పాత్రకు రణ్‌వీర్ సింగ్ కంటే అల్లు అర్జున్ అయితేనే నూటికి నూరు పాళ్ళు సరిపోతారని సిరీస్ సృష్టికర్త ముఖేష్ ఖన్నా అభిప్రాయపడటం గమనార్హం. అల్లు అర్జున్ లుక్స్, పర్సనాలిటీ పాత్రకు అద్భుతంగా సరిపోతాయని పేర్కొన్నారు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా బాసిల్ జోసెఫ్ బాలీవుడ్‌లో శక్తిమాన్ ప్రాజెక్ట్ కోసం రెండేళ్ల విలువైన కాలాన్ని వృధా చేసుకున్నారన్నారను. అక్కడ ఎదురైన కొన్ని పరిణామాల వల్లే ఆయన మళ్లీ సౌత్ సినిమాలపై దృష్టి పెట్టారని వెల్లడించారు.