బ‌న్ని సాధించిన ఘ‌న‌త‌కు బాస్ అర‌వింద్ ఎగ్జ‌యిట్ అయిన వేళ‌!

టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్‌గా ప్రస్థానం ప్రారంభించి నేడు పాన్ ఇండియా బాక్సాఫీస్ బాద్‌షాగా ఎదిగిన అల్లు అర్జున్ జైత్ర‌యాత్ర పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Update: 2026-09-23 14:16 GMT

టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్‌గా ప్రస్థానం ప్రారంభించి నేడు పాన్ ఇండియా బాక్సాఫీస్ బాద్‌షాగా ఎదిగిన అల్లు అర్జున్ జైత్ర‌యాత్ర పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒక తండ్రిగా, ఇండస్ట్రీలో దిగ్గజ నిర్మాతగా ఆయన వ్యక్తపరిచిన ఆనందం ప్రస్తుతం సినీ వర్గాల్లో, నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. `పుష్ప` చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలన రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ ఇప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్రను తిరగరాసే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.

`పుష్ప` ఫ్రాంఛైజీతో అల్లు అర్జున్ సాధించిన విజయం కేవలం తెలుగు చిత్రసీమకే పరిమితం కాలేదు. బాహుబలి 2, కేజీఎఫ్ 2 వంటి భారీ చిత్రాల సరసన నిలుస్తూ.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వంద‌ల కోట్ల‌ వసూళ్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా ఉన్న ఎన్నో రికార్డులను సైతం పుష్ప చిత్రం బ్రేక్ చేసింది. బాలీవుడ్‌లోని టాప్ హీరోలైన ఖాన్‌ల త్రయం సైతం సాధించని రీతిలో భారీ బంపర్ హిట్‌ను కొట్టి ఐకాన్ స్టార్ తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు.

ఈ అసాధార‌ణ‌ విజయాల జోరును కొనసాగిస్తూ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. పుష్ప ఫ్రాంఛైజీ రికార్డులను కూడా కొట్టేసేలా, భారతీయ వినోద పరిశ్రమలో `నెవర్ బిఫోర్` అనే రీతిలో బాక్సాఫీస్ వద్ద సరికొత్త మైలురాళ్లను నెలకొల్పాలనే గట్టి పట్టుదలతో అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడి కెరీర్ గ్రాఫ్ చూసి అల్లు అరవింద్ పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

ఇదే విషయమై తాజాగా గ‌లాట్లా ప్లస్ ఇంటర్‌వ్యూలో అల్లు అరవింద్ మాట్లాడుతూ తన మనసులోని భావాలను పంచుకున్నారు. ``అల్లు అర్జున్ మా కుటుంబం నుంచి మూడో జనరేషన్‌ను ముందుకు తీసుకువెళ్తున్నాడు. మా నాన్నగారు నిర్మాత కం న‌టుడు. నేను కూడా నిర్మాత‌ను. అర్జున్ హీరోగా మారడం ఒకెత్తయితే.. ఇప్పుడు దేశంలోనే అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమాలలో నటిస్తుండటం మాకు వేరే లెవెల్ ఎక్సైట్‌మెంట్‌ను ఇస్తోంది. ఇండస్ట్రీలోని పెద్దలందరి ఆశీస్సులతో నా కొడుకు ఈ స్థాయికి చేరుకున్నాడు`` అంటూ ఎంతో గర్వంగా, ఎమోషనల్‌గా వ్యాఖ్యానించారు.

అల్లు అరవింద్ ద‌శాబ్ధాల కాలంగా తెలుగు సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధాన్ని.. తన కుమారుడు అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా సాధిస్తున్న కీర్తి ప్రతిష్టలను బేరీజు వేస్తూ షేర్ చేసిన‌ ఈ మాటలు మెగా- అల్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా భారతీయ చిత్రసీమ గర్వించదగ్గ పాన్ ఇండియా స్టార్‌గా అల్లు అర్జున్ ఎదిగిన తీరు ఇటు కుటుంబానికి, అటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక చారిత్రాత్మక క్షణంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News